Krishavamsi celebrates Prakash Raj's accomplishments

Friday, September 25, 2015 - 12:30

As Prakash Raj steps into 50th year, director Krishnavamsi recalls his association with the actor. What started with a professional relation turned personal. The director and actor share a special bond. Once they were thick friends and then there were some bad days. Prakash Raj and Krishnavamsi parted ways then and after sometime they again became good friends.

Krishnavamsi says that their friendship went many upheavals but stood test of the time. The director fondly recalls his association with Prakash Raj, the actor and the person..
 
Krishnvamsi wrote personally this in Telugu to share with Telugucinema.com readers

ప్రకాశించే రాజు

నా జీవితంలో నా మనసుకి అత్యంత దగ్గరైన అతి కొద్దిమంది ఆత్మీయులలో ప్రకాష్‌రాజ్ ఒకడు. నేను ‘అంతఃపురం’ కట్టడం కోసం కావలసిన రాళ్ళను వెతుకుతున్నప్పుడు తళుక్ తళుక్‌మంటూ ఒక రాయి కనిపించింది. (అప్పుడు వీడి పేరు... అసలు పేరు... ప్రకాష్ రాయ్) ఆ రాయి అప్పటికే ఇతర భాషల్లో తన ప్రకాశాన్ని వెదజల్లడం ప్రారంభించింది. (బాలచందర్ - డ్యూయెట్, మణిరత్నం - ఇరువర్, వసంత్ - ఆశై ఆశై). వాణ్ణి కలిసి మాట్లాడిన తర్వాత వాడే ‘అంతఃపురం’ నరసింహ అనిపించింది. వాడితో నా ‘అంతఃపురం’ శోభాయమానమైంది. ఆ తర్వాత ఆ రాయి దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుతూ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురం, బెంగాలీ భాషల చుట్టూ ప్రాకారం కట్టేసి, దాని లోపల దుర్భేద్యమైన కోట కట్టేసుకున్నాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రకాశించే రాజయ్యాడు. నట(న)రాజు అయ్యాడు. వాణ్ణి చూస్తున్నప్పుడల్లా నా మనసు ఆనందిస్తూ వుంటుంది.

వీడు ఏ భాషలోకి వెళ్ళినా ఆ భాష నేర్చుకుంటాడు. ఆ భాషని అనుభవిస్తాడు. ఆ భాషలోని గొప్ప సాహిత్యంతో సాన్నిహిత్యం పంచుకుంటాడు. మన తెలుగులో చలం గారిని, తిలక్ గారిని, వంశీ గారిని చదివేశాడు. నటుడికి కావలసిన అతి ముఖ్యమైన లక్షణం అది. వీడు ఏ పాత్ర చేస్తున్నా ముందు ఆ పాత్రని చదువుతాడు. అర్థం చేసుకుంటాడు. ఆవహింపజేసుకుంటాడు... ఆవహిస్తాడు. ప్రాణం పెడతాడు. ఆ పాత్రకి ప్రాణం పోస్తాడు.

‘అంతఃపురం’ నుంచి వాడితో ఎన్నో ప్రయాణాలు, ఎన్నో విందులు, ఎన్నో వినోదాలు, ఎన్నో ఇష్టాగోష్ఠులు, ఎన్నో ఆలోచనల యుద్ధాలు, ఎన్నో మనస్పర్థలు, ఎన్నో కోపతాపాలు, ఎన్నో సర్దుబాట్లు, ఎన్నో మంచి ఫీలింగ్స్, ఎన్నెన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు. వాడి గురించి ఆలోచన రాగానే నాకు తెలియకుండానే చిరునవ్వు వచ్చేస్తుంది. దీనికి కారణం కేవలం వాడు మంచి నటుడనే కాదు... వాడితోటి నా వ్యక్తిగత ప్రయాణంలో వాడిలోని మిగతా అద్భుతమైన షేడ్స్‌ని కూడా దగ్గరగా చూడగలగటమే. దాంట్లో చాలా ముఖ్యమైంది...  వాడి స్నేహతత్వం. స్నేహానికి ప్రాణం పోస్తాడు. ఎంతోమంది స్నేహితులని ఆపదల్లో ఆదుకుని, వాళ్ళ జీవితాలను సరిచేయడం నేను చాలా దగ్గరగా చూశాను. ఇంకోటి కుటుంబతత్వం. వాడి కుటుంబాన్ని వాడు ఎంత గొప్పగా చూసుకుంటాడో వాణ్ణి ఎరిగున్నవాళ్ళు అందరికీ తెలుసు.

సొంత మూలాలను మరచిపోతున్న ఈ ప్రపంచంలో తనకు మూలమైన నాటకరంగాన్ని, నాటక కళని, తన తోటి కళాకారుల్ని... దేన్నీ, ఎవర్నీ మరచిపోకుండా ఈరోజుకీ వెళ్ళి తనవంతు సాయం చేస్తుంటాడు. సపోర్ట్ చేస్తుంటాడు. ఏమాత్రం పబ్లిసిటీని ఆశించడు. నేను చూసిన అత్యంత అరుదైన, గొప్ప లక్షణమిది. తనకు సినిమా మూలమైన బాలచందర్‌ గారంటే వాడికి ఎంత భక్తో, ఎంత విశ్వాసమో, ఎంత కృతజ్ఞతో మొత్తం ప్రపంచానికి తెలుసు.

వీడికి మనుషులంటే చాలా ఇష్టం. మనుషులు మాత్రమే కాదు.. చెట్లన్నా, ఆ చెట్లమీద ముచ్చట్లు చెప్పుకునే పిట్టలన్నా... చెరువులన్నా, ఆ చెరువుల్లో షికార్లు చేసే చేపలన్నా, పంట పొలాలన్నా, ఆ పంట పొలాల మధ్యలో సూర్యోదయాలన్నా, సూర్యాస్తమయాలన్నా, వెన్నెల రాత్రులన్నా, ఆ వెన్నెల రాత్రుల్లో ఇళయరాజా అన్నా, అక్కడి ప్రశాంతమైన, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడమన్నా నాలాగే వాడికీ చాలా పిచ్చి. మా ఇద్దరి మధ్యా వున్న తెలియని బంధం బహుశా అదేనేమో. అది కేవలం కలగానో, ఆశగానో మిగల్చకుండా దాన్ని చెమటోడ్చి కార్యరూపంలో పెట్టి హైదరాబాద్‌ సమీపంలోను, చెన్నైలోను, మైసూరులోను వాడు కోట్లు ఖర్చుపెట్టి డెవలప్ చేసిన వ్యవసాయ క్షేత్రాలని చూస్తుంటే, అదేదో సినిమాలో ముళ్ళపూడిగారు చెప్పినట్టు మనసంతా రాజసంద్రం అయిపోతుంది.

ప్రకాష్‌రాజ్ హైదరాబాద్‌ సమీపంలో ఆవిష్కరించిన వ్యవసాయ క్షేత్రంలో ఒకరాత్రి మేమిద్దరమే కూర్చుని ఆ మట్టివాసనతోపాటు ఇళయరాజాని అనుభూతిస్తుంటే, ఏరా వృత్తి మార్చేస్తున్నావా.. రైతువైపోతున్నావా అన్న నా ఛలోక్తికి వాడు ప్రతిస్పందిస్తూ... పుట్టాం... ఇన్ని సంవత్సరాలుగా ప్రకృతి నుంచి గాలి, నీరు, భూమి లాంటి అద్భుతమైన ప్రాణాధార శక్తుల్ని స్వేచ్ఛగా, ఉచితంగా వాడేసుకుంటూ బతికేస్తున్నాం. మనం వాడుకున్నది ప్రకృతికి మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసమేరా ఇదంతా... మన తర్వాతి తరాలు కూడా బతకాలి కదరా... అని పెద్ద పెద్ద కళ్ళేసుకుని చిన్నపిల్లాళ్ళా చెప్పాడు. ఎంత నోబుల్ థాట్ అది... (మనం గాల్లోని ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్‌ని వదిలి వాతావరణాన్ని కలుషితం చేస్తూ వుంటాం. చెట్లు ఆ కలుషితమైన కార్బన్ డై ఆక్సైడ్‌ని తీసుకుని ప్రాణాధారమైన ఆక్సిజన్ ఇస్తున్నాయి... అది ప్రకృతి) మా చుట్టూ వున్న మొక్కల మీద నుంచి వచ్చిన చల్లటి, స్వచ్ఛమైన గాలి తగులుతున్నప్పుడు ఎంతటి హాయి కలిగిందో... ప్రకాష్‌రాజ్ చెప్పిన ఆ మాట విన్నప్పుడు కూడా అలాంటి హాయే కలిగి మనసు జిల్లుమంది.

వాణ్ణి ఆ క్షణంలో చూస్తూ ఒక అద్భుతాన్ని చూస్తున్న ఆశ్చర్యంలో మునిగిపోయాను. ప్రకాష్‌రాజ్ ఆ మర్నాడే తన వ్యవసాయ క్షేత్రం వున్న ఊరిని దత్తత తీసుకుని, అక్కడ వున్న హైస్కూల్ని, రవాణా సదుపాయాల్ని, మంచినీటి సదుపాయాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నాడు. ఆ ఊరిలో వృద్ధులందరికీ పునరావాసం కల్పించడానికి కృషి మొదలుపెట్టాడు. ఊళ్ళోని కుర్రాళ్ళందర్నీ పోగేసి, వారిని ఒక మంచిదారిలో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించేశాడు. ప్రభుత్వాన్ని కలిశాడు.. ప్రభుత్వాన్ని ఆ ఊరికి తీసుకొచ్చాడు. ఇంకా ఎక్కడెక్కడకి వెళ్ళిపోతాడో... ఏమేం చేసేస్తాడో.. ఇలాంటివాడు నాకు స్నేహితుడైనందుకు గర్విస్తున్నాను.

ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో, ఎన్నెన్నో, ఎన్నెన్నెన్నెన్నో... మనుషులు చాలామంది పుడతారు, పెరుగుతారు, ఉద్యోగాలు చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని పెడతారు. వాళ్ళకే తెలియకుండా ఒకరోజు చచ్చిపోతారు. కానీ, కొంతమందే నిజంగా బతుకుతారు. గొప్పగా బతుకుతారు... చచ్చిపోయిన తర్వాత కూడా!  బతికితే మీలా బతకాలి సార్ అని ప్రకాష్‌రాజ్‌తో ఎవరో అన్నమాట ఎప్పుడూ గుర్తొస్తూ వుంటుంది. ఒరే, బతికితే నీలా బతకాల్రా... గాడ్ బ్లెస్.

కృష్ణవంశీ