From the archives: Interview with Writer Ganesh Patro

Thursday, January 5, 2017 - 10:00

Noted writer Ganesh Patro who passed away in 2015 penned many classic movies in Tollywood. This is a old interview we did a few years ago. This interview gives a glimpse of his career, his writing, a bit of Telugu cinema's history as well. He wrote dialogues for films like K Balachander's 'Maro Charitra', 'Guppedu Manasu' and 'Akali Rajyam'. He also penned super hit movie 'Seethamma Vaakitlo Sirimalle Chettu'. Today (Jan 05) is his death anniversary. We are reproducing this old interview.

This conversation happened between Ganesh Patro and Sri Atluri in 2006.


మార్చ్ 1984

పొద్దున్న 8:30 ..  పొద్దునే పేపర్ చదువుతూ పక్కింట్లో నుంచి వచ్చే వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు వింటున్నా.  అప్పుడే ఫిబ్రవరి లో విడుదల అయినా ముద్దుల కృష్ణయ్య మీద మొదటిసారిగా గణేష్ పాత్రో గారి పేరు విన్నా .  ఆ సినిమా దాదాపు గా సంవత్సరం ఆడేసింది సుభాష్ థియేటర్ (ముషీరాబాద్ , హైదరాబాద్ ) లో అప్పుడు ఆ సినిమా కి పంపిణీదారులు శ్రీనివాసా ఫిలిమ్స్ వాళ్ళు.  ఆ తరవాత చాలా సార్లు గణేష్ పాత్రో గారి పేరు విన్నా , ( దాదాపు గా అన్ని బాలచందర్ గారి  అన్ని సినిమాలు ఇలా చాలా. క్రాంతి కుమార్ , స్రవంతి రవికిశోర్ గారి సినిమాలు , సీతారామయ్య గారి మనవరాలు, తలంబ్రాలు, ఆహుతి , మయూరి , అమ్మ రాజీనామా , 2001 లో తొమ్మిది నెలలు చిత్రం తరవాత పన్నెండు ఏళ్ళకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) ) కానీ పర్సనల్ గా వారితో పరిచయం ఎప్పుడు జరగలేదు. నేను హైదరాబాద్ లో అయన మద్రాస్ లో ఉండటం వల్ల అనుకుంటా . ఆ తరవాత నేను అమెరికా రావడం ,  సరదాగా సినిమా ఇంటర్వ్యూలు చెయ్యడం వల్ల చాలా మంది పరిచయం అయ్యారు.  అలాగే ఒక సారి అంతులేని కథ సినిమా మీద ఒక ఆర్టికల్ రాస్తూ గణేష్ పాత్రో గారి పేరు దగ్గర ఆగిపోయా , దాదాపు ఒక ఏడాది పాటు అయన  ఫోన్ నెంబర్ పట్టుకోవడానికి సరిపోయింది (నేను ఇండియా లో ఫ్రెండ్స్ కి చెప్పడం వాళ్ళు బిజీ లో కనుకుంటా అని కాలం గడపటం ఆలా జరిగిపోయాయి ) .

2006 విజయదశమి..
మొత్తానికి అయన నెంబర్ సంపాదించి , ఫోన్ చేశా.  అయన బిజీ గా ఉన్నాను తరవాత మాట్లాడుదాం అని అన్నారు . నేను పట్టువదలని విక్రమార్కుడి లాగా ఇంకో నాలుగు సార్లు కాల్ చేశాను.   ఆ ముహూర్త బలం ఏంటో తేలీదు కానీ ఆ తరవాత దాదాపు గా ప్రతి నెల కో రెండు నెలలకో నేను ఆయనకి ఫోన్ చెయ్యడమో లేక నేను చెయ్యకపోతే అయన ఫోన్ చేసి  " ఎరా నాన్న ఎలా ఉన్నావు ఫోన్ చెయ్యడం లేదు నీ ఆరోగ్యం  అది ఎలా ఉంది అని ? " అని ఆయనే ఫోన్ చేసే వారు.

అమెరికా లో ఎక్కడ ఏదన్న కాల్పుల్లో లేక ఇంకా ఏదన్న జరిగితే అయన మొదటగా ఫోన్ చేసే వారు " ఏరా నాన్న మీ ఊర్లో కాదు కదా . నువ్వు ఎలా ఉన్నావు ? " అని ఫోన్ వచ్చేది .

ఏ రోజు నన్ను ఒక పాత్రికేయుడు గా కానీ ఒక తెలీని మనిషి గా కానీ చూడలేదు. అసలు మేమిద్దరం ఎప్పుడు కలవలేదు అంటే ఎవ్వరు నమ్మరు  అంత బాగా నాతొ మాట్లాడేవారు. ఒక సారి ఒట్టావా (కెనడా ) కి వాళ్ళ అబ్బాయి గారి ఇంటికి వచ్చారు . రాగానే నాకు ఫోన్ చేసి కుదిరితే రమ్మన్నారు . నాకు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అప్పుడే సడన్ గా  ఒకరోజు న్యూయార్క్ ఒక్క రోజు కోసం వస్తున్నా రావడానికి కుదురుతుందా అన్నారు . అప్పుడు కూడా కుదరలేదు. దాంతో ఆయనని కలవడం కుదరలేదు. 

సీతమ్మ వాకిట్లో సినిమా రిలీజ్ అయిన రోజు నేను ప్రీమియర్ అయ్యాక బాగా లేట్ అవ్వడం తో పొద్దున్నే ఫోన్ చేద్దాం అని పడుకున్నా.  పొద్దున్న లేచి తీరికగా చేద్దాం అనుకుని కాల్ చేశా . అయన పొద్దున్న నుంచి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అంటే ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు.   

బాలచందర్ గారితో మాట్లాడాలి అంటే అయన ఫోన్ లో ఇంటర్వ్యూ లు ఇవ్వరు కానీ నేను చెప్తా లే అన్నారు . ఆయనతో మాట్లాడించారు. అప్పటికే బాలచందర్ గారి ఆరోగ్యం సరిగ్గా లేదు .  అయన ఆరోగ్యం కుదుట పడ్డాక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను .  కానీ అయన ఆ అనారోగ్యం నుంచి బయటపడకుండా నే వెళ్లిపోయారు.  ఆ వార్త కి పాత్రో గారు ఎలా తట్టుకున్నారో అని ఇంటికి ఫోన్ చేశాను. అప్పుడే అయన అనారోగ్యంగా ఉన్నారు హాస్పిటల్ లో ఉన్నారు అని చెప్పారు. అప్పటి నుంచి రోజు ఫోన్ చేసి పరిస్థితి కనుకున్నే వాడిని.  సరిగ్గా బాలచందర్ గారు పోయిన పన్నెండు రోజులకి గణేష్ పాత్రో గారు కూడా వెళ్లిపోయారు తిరిగిరాని లోకాలకి  (బాలచందర్ గారి మరణం గణేష్ పాత్రో గారికి తెలియనివ్వలేదు ) . 

ఒక మనిషి మరణం మనం  మనకి ఎంత కోల్పోయామో అయన పోయాక కానీ తేలీదు అన్నదానికి ఉదాహరణ నాకు వారికీ ఉన్న అనుభందం . అయన మాట్లాడుతుంటే ఇంట్లో సొంత మనిషి మాట్లాడుతున్నట్టు గా ఉండేది . ఒక మనిషిని మనం వ్యక్తిగతం గా కలవకపోయినా చేరువ అవడం అంటే ఇదే ఏమో .  అయన పోయి రెండు సంవత్సరాలు అయినా ఇంకా అయన మాట మనసు రెండు ఇక్కడే ఉన్నట్టు గా ఉంటుంది. ఎరా నాన్న ఎలా ఉన్నావు అన్న పదం ఇంకా వినిపించదు అంటే నమ్మబుద్ది కావడం లేదు .   మనం ఈ జీవన పరుగు పందెం లో ఎం కోల్పోతున్నామో కోల్పోయాక కానీ తెలీదు అంటే ఇదే .  అయన నా స్మృతిలో ఎప్పటికీ సజీవులే . దాదాపు గా పదేళ్లు ఆయనతో ఉన్న బంధం  ఒక జీవిత కాల అనుభందం .  

గణేష్ పాత్రో గారు మరణించడానికి ముందర వారితో జరిపిన ఇంటర్వ్యూ లో విశేషాలు క్లుప్తం గా  : 

మరో చరిత్ర, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, గుప్పెడు మనసు ఇలాంటి సినిమాల పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది కె.బాలచందర్ గారి పేరు. చాలా కొద్ది మంది సినీప్రియులు గుర్తించే మరో విషయం ఒకటుంది. ఈ సినిమాలన్నిటికీ రచయిత ఒక్కరే. గణేశ్ పాత్రో గారు. ప్రస్తుతం చెన్నైలో నివాసం వల్ల ఆంధ్ర పాత్రికేయులతో అట్టే టచ్‌లో లేరు అందుకే ఈ తరంలో చాలా మందికి ఆయన గురించి
తెలియదు. చాలా ప్రయాస పడి ఆయన్ని సంప్రదిస్తే ప్రస్తుతం టీవీ సీరియళ్ళతో బిజీగ ఉన్నాను తీరిక చేసుకొని ఫోన్ చేస్తానన్నారు.  చివరికి ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పిన విశేషాలు...

చిన్నప్పుడు..

మా నాన్నగారు పార్వతీపురం దగ్గిర ఒక గ్రామానికి కరణం గా పని చేస్తుండేవారు. నా చిన్నప్పుడు ఆయన రాత్రుళ్ళు,  గ్రామస్థులకోసం రామాయణ, మహాభారతాలను చదువుతూ ఉండేవారు. నాకట్టే అర్థాలు తెలియకపోయినా, నేనూ ఆయన్ని అనుకరిస్తూ చదివేందుకు ప్రయత్నిస్తుండేవాణ్ణి. ఆయనొకసారి నా పఠనం విని, ఆనాడు నన్నే చదవమన్నారు. నేను శ్లోకాలు చదువుతుంటే ఆయన అర్థాలు, తాత్పర్యాలు చెబుతుండేవారు. మా ఊర్లో హైస్కూల్ ఉండేది కాదు అందుకని ఆయన పార్వతీపురంలో ఒక ఇల్లుకొన్నారు. తోడుగా మా బామ్మ ఉండేది. గట్టిగా మందలించే వారు లేకపోవడంతో నేను నాటకాల్లో చురుకుగా పాల్గొనడం మొదలెట్టాను.

పాఠ్యపుస్తకాలతో పాటు చాలా సాహిత్యపుస్తకాలు చదివేవాణ్ణి.  నా తరువాత చెల్లి, తమ్ముడూ అదే బళ్ళో చేరడంతో మా అమ్మకూడా పార్వతీపురం వచ్చేశారు. మా నాన్నగారు కూడా పార్వతీపురంలో ఉంటూ గ్రామానికి వారానికి రెండుసార్లు వెళ్ళిరావడం మొదలెట్టారు. రావిశాస్త్రి గారి ప్రేరణతో విశాఖయాసలో చందోబద్ధమైన పద్యాలు రాసి విఫలమయ్యాను. పీయూసీ పూర్తవగానే  యూనివర్సిటీకి ఎక్కడికి వెళ్ళాలా  అని ఆలోచిస్తున్న సమయంలో మిత్రులంతా ఆంధ్రా యూనివర్సిటీ బాగుంటుందని సలహా ఇచ్చారు. అక్కడ స్టేజీ నాటకాలుంటాయా లేదా అన్న ఒక్క విషయం నిర్ధారించుకొని అక్కడికే వెళ్ళాను. ఏయూ లో సాంస్కృతిక విభాగానికి సంయుక్త కార్యదర్శి పదవి నిర్వహిస్తూ, నాటకాలు రాసి, నటిస్తూ ఉండేవాణ్ణి.

సినీరంగంలో తొలి అడుగు

తేనెమనసులు లో పాత్రకోసం నేనూ అప్ప్లయి చేశానని చాలా మందికి తెలియదు. స్క్రీన్ టెస్ట్‌కు పిలుపు కూడా వచ్చింది కాని ఆ ఉత్తరం నాన్నగారి చేతిలో పడటం, ఆయన ససేమీరా అనడంతో నేను వెళ్ళలేదు. నేను నాటక రచయితని అయ్యాక   క్రాంతికుమార్ గారు, మరికొందరు రమ్మని ఆహ్వానించారు కానీ ఈ సారి మా మావగారు వద్దన్నారు. ఆయనప్పటికే నాలుగైదేళ్ళు సినీ ఫీల్డులో పనిచేసి
విసిగిపోయి ఉన్నారు. ఇద్దరు మిత్రులు లో ఏఎన్నార్ వద్ద పనివాడిగా, కన్నెవయసులో రోజారమణి తండ్రిగా రెండు పాత్రలు వేశారు. మా మావగారు పోయాక మద్రాసులో ఒక నాటకం వేశాం. ఆ నాటకాన్ని చూసిన ప్రభాకర్ రెడ్డిగారు దాన్ని సినిమాగా తీద్దామన్నారు. నిజానికి మూడు నాటకాలను కలిపి నా మొదటి సినిమా రూపుదిద్దుకొంది. "నాకు స్వతంత్ర్యం వచ్చింది" టైటిల్. అదే జయప్రద గారి మొదటి సినిమా కూడా. ప్రభాకర్ రెడ్డిగారితో పని చేయడం ఒక గొప్ప అనుభవం. ఆయన చాలా చాలా మంచివారు. నాకు చాలా సహాయం చేశారు. తన పార్ట్నర్స్ కి తెలీకుండా నాకు ఆర్థికసహాయం చేసేవారు. చాలా మంచి మనిషి.

నా సినీ ప్రస్థానం

ఎగుడు దిగుడుగా మొదలయ్యింది. మద్రాసులో నా నాటకాలు చూసిన దుక్కిపాటి మధుసూదనరావు గారు వెంటనే ఒక ఆఫరిచ్చి వెయ్యినూటపదహార్ల అడ్వాన్సు ఇచ్చారు. ఆ రోజుల్లో, రైటర్లకి అది చాలా పెద్దమొత్తం. అలాగే ఆయన అతిథి గృహంలో విడిదినిచ్చారు. ఆత్రేయ మాస్టారు, సుశీల గారు, చక్రవర్తి గారు నా పక్కనే ఉండేవారు. మూణ్ణెళ్ళ కథా చర్చలు, సంభాషణల తర్వాత ఆయన ప్రాజెక్టు ఆపేసి ఇంటిని ఖాళీ చేయమన్నారు. ఒక్కసారిగా ఏమీ తోచని అయోమయంలో పడ్డాను. ఆ కథా చర్చల్లో పాల్గొన్న తాతినేని రామారావుగారు నన్ను ప్రత్యగాత్మ గారికి రికమండ్ చేశారు. ఆయన నాకు అల్లుళ్ళొస్తున్నారు సినిమా ఇచ్చారు. అది కాస్తో కూస్తో హిట్టయ్యాక నాకు ఆఫర్లు రావడం మొదలెట్టాయి.

ఆత్రేయ గారితో అనుబంధం

ఇంత చిన్న వ్యాసంలో చెప్పలేను. ఆయన గురించి చెబుతూ ఎంత రాసినా సరిపోదేమో. ఆయనెంతో గొప్ప మనీషి. ప్రత్యగాత్మ గారు నాకు PAP బ్యానర్లో అవకాశమిచ్చినప్పుడు నా దగ్గిర అట్టే డబ్బుల్లేవు. నా పిల్లలిద్దర్నీ బళ్ళో చేర్పించడానికి అడ్మిషన్ ఫీజులు కట్టాలి. అంత పెద్ద బ్యానర్లో పని చేయడం అదే మొదలవడంతో ఎలా అడగాలో తెలీదు. అప్పుడు ఆత్రేయగారే నన్ను పిలిచి అడిగారు డబ్బులేవైనా ఉన్నాయా అని. లేవని సమాధానమివ్వడంతో ఇంట్లో పరిస్థితి గురించి వాకబు చేసి, ఆయన అసిస్టెంటుతో ఫీజు పంపించారు. అలాగే నాకూ కొన్ని డబ్బులిచ్చారు.

PAP బానర్ డబ్బులిచ్చాక వెనక్కిస్తే తీసుకోవడానికి నిరాకరించారు. ఆయనే నన్ను బాలచందర్ గారికి పరిచయం చేశారు. ఇవాళ నేనున్న పొజిషన్ కి ఆత్రేయగారే కారణం. ఆయన ఆశీర్వాదంతోనే నేనీ ఫీల్డులో మనగలిగాను.

ఈరంకి శర్మగారు చిలకమ్మ చెప్పింది సినిమాని బాలచందర్ గారి పర్యవేక్షణలో రీమేక్ చేస్తున్నారు. అది మలయాళ సినిమా రీమేక్.  బాలచందర్ గారికి దర్శకుడితో సెట్లపై సమయం వెచ్చించగలిగే ఒక మంచి రచయిత కావాలి. గురువుగారు అప్పటికే బిజీ అవడంతో, నన్ను బాలచందర్ గారి సహాయకులు అనంత్ గారికి పరిచయం చేశారు. అనంతు గారికి నా స్టేజి బాక్‌గ్రౌండ్ తెలిశాక మరింత ఆసక్తి కలిగి బాలచందర్ గారివద్దకు తీసుకెళ్ళారు. ఆయనకు నేను చిలకమ్మ చెప్పిందికి చేసిన పని చాలా నచ్చింది. అది అనకాపల్లిలో, వైజాగ్‌లో చిత్రీకరించాం. KB,కమల్ ని పరిచయం చేస్తూ తెలుగులో ఒక డైరెక్టు చిత్రం చేయాలని తలపెట్టారు. అంతులేనికథ చేస్తూ వైజాగ్ నచ్చడంతో అక్కడే దాన్ని షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆత్రేయగారు అనారోగ్యం వల్ల మరోచరిత్ర చేయలేక నన్ను చేయమని బాలచందర్ గారికి రికమెండ్ చేశారు. అలా కేబీ గారితో నా అనుబంధం మొదలయ్యింది.

మరోచరిత్ర చూశాక ఆత్రేయ గారు నన్నందరిముందూ కౌగిలించుకొని నాకు గర్వంగా ఉంది. చాలా బాగా రాశావు అన్నారు. అక్కడికక్కడే భరతముని అవార్డు దొరికినంత సంబరం కలిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేనా సంఘటన మర్చిపోలేను. చాలా గొప్ప మనిషి. నన్ను బాగా ప్రోత్సహించేవారు. చాలా సినిమాలకు రికమెండ్ చేసారు.

బాలచందర్ గారితో..

బాలచందర్ సర్, నేనూ ఇప్పటికి ఇరవయ్యేళ్ళుగా కలిసి పనిచేశాం. అంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే కుదరదు. మాకు చిన్న చిన్న అభిప్రాయభేదాలున్నా ఆయన హృదయం మాత్రం బంగారం. ప్లాటినం కూడా  ( నవ్వు ) . ఆయనకు మనుషులంటే విపరీతమైన అభిమానం. చాలా సున్నిత స్వభావులు. అప్పట్లో నేను చెయిన్‌స్మోకర్‌ని. ఆయన ముందు కూడా కాల్చగలిగే పర్మిషన్ నాకొక్కడికే ఉండేది. ఆయన ముందు సిగరెట్ తాగే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అందుకని షూటింగ్ మధ్యలో బయటకివెళ్ళేవాణ్ణి. అదే గ్యాప్‌లో నా కోసం అడిగేవారు. సెట్లో లేనని చెప్పేవాళ్ళు అక్కడ. వెనక్కోచ్చాక అడిగితే సిగరెట్ కోసం వెళ్ళానని చెప్పాను. ఇలా ఒక వారం రోజులు జరిగింది. ఒకరోజు ఆయన పిలిచి, ఇక్కడ అంతా స్మోక్ చేసే వాళ్ళే నా ముందర నటిస్తారు. ఒక్క నువ్వే ధైర్యంగా చెప్పావు. షూటింగ్ సమయం అట్టే వృధా చేయొద్దు. కావలంటే నా ముందరే సిగరెట్ తాగు అన్నారు. ఇప్పుడు నేను మానేశాననుకోండి.

మేమిద్దరం కలిసి చేసిన మరోచరిత్ర చాలా హిట్టయ్యింది. అదాయన రెండు భాషల్లో నిర్మించారు. నేనూ తెగ బిజీగా ఉండేవాణ్ణి. దాంతో చాలా మంది నేను వేరే వాళ్ళకు చేయననుకోవడం మొదలెట్టారు. అలాగే నేను కేవలం ఆయన డైలాగుల్ని తెలుగులోకి అనువదిస్తానని మరో పుకారుండేది. రెండూ అబద్ధాలే. సీన్ గురించి చర్చించాక ఇద్దరం డైలాగులు రాసుకునేవాళ్ళం. మర్నాడు పొద్దున
ఇద్దరం చూసుకొనేవాళ్ళం షూటింగ్ ముందర. అనువదించే  సమయమెక్కడిది? నిజానికి కొన్ని సార్లు, నా డైలాగులు బాగున్నాయని తలిచి, ఆయన తిరగరాయడానికి షూటింగ్ కాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గుప్పెడు మనసు సినిమా టైటిల్ కూడా నేను సజెస్ట్ చేసిందే. తమిళ మాతృక (నూల్ వెళి..దారంతో సరిహద్దు) తెలుగుకు అంత నప్పదని నేను సూచించాను. అదాయనకు
చాలా నచ్చింది. ఈ మధ్య ఒక పెద్ద టీవీ సీరియల్ తీశారు ఇదే టైటిల్ తో. ఇలాంటివి చాలా ఉన్నాయి.

మిగతా కాంపుల్లో..

వేరేవారికి నేను రాయననే  అపవాదు చెరిపేసినందుకు నేను భార్గవ ఆర్ట్స్ గోపాలరెడ్డి గారికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తమిళంలో హిట్టయిన ఒక చిత్రాన్ని తెలుగులో మనిషికో చరిత్రగా తీద్దామనుకున్నారు. అందరిలాగే నేను రీమేకులకే రాస్తాననుకొని నాదగ్గరికి వచ్చారు. కానీ నన్ను కలిశాక ఆయన అభిప్రాయం మార్చుకొన్నారు. అప్పటినుండీ నేను వాళ్ళ బానర్లో శాశ్వత  సభ్యుడినయ్యాను. దాదాపు ప్రతీ సినిమా నేనే రాశాను. అన్నీ బాగా హిట్టయ్యాయి. మనిషికో చరిత్ర సినిమాలో చివర్లో నేను కనిపిస్తాను కూడా. KB తో పోలిస్తే పని తీరులో చాలా తేడా ఉండేది. కానీ రచయిత ఎప్పుడూ ఒక బ్రాండుకు పరిమితమవకూడదు. ఏ పనైనా నిరూపించుకోగలగాలి.
జయభేరి బానర్ కి కూడా నేను చాలా సినిమాలు రాశాను.  ఒకవిధంగా అక్కడ కూడా పర్మనెంట్ రైటర్ నేనే. అతడు సినిమాకి మాత్రం, త్రివిక్రం స్వయాన రచయిత అవడం వల్ల రాయలేదు.

అలాగే అందమైన అనుభవం, నిర్ణయం సినిమాలకు కొన్ని పాటలు కూడా రాశాను. అంత గుర్తుంచుకోదగ్గవేమీ కాదులే. ఏదో అవసరార్థం రాసినవి, పెద్దగా చెప్పడానికేమీ లేదు వాటి గురించి.

గణేశ్ పాత్రో, వివాదాలు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. నంది అవార్డులు మొదలయిన కొత్తలోనే  అవి తిరస్కరించిన వాట్లో నేనొకణ్ణి. మొదట్లో నంది అవార్డులు కేవలం కొత్త చిత్రాలకు మాత్రమే ఇచ్చేవారు. డబ్బింగ్ సినిమాలకిచ్చేవారు కాదు. చిలకమ్మ చెప్పింది తెలుగులో మంచి విజయం సాధించినా దానికో మలయాళ సినిమా మాతృక. ప్రభుత్వం అవార్డిచ్చినప్పుడు, పాత్రికేయుడొకరు నా
అభిప్రాయమేమిటని అడిగారు. రీమేకు చిత్రాలు అవార్డుకు అనర్హులని నేను స్వీకరించలేదు  . తర్వాత చాలా రచ్చ జరిగి, ప్రభుత్వం అవార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఆ రోజుల్లో,  విజయచిత్ర (చందమామ పబ్లికేషన్స్) వారు యువ రచయితలను ప్రోత్సహిస్తూ ఒక కాలం నిర్వహించేవారు. పరిశ్రమలో ఎవరికైనా నచ్చితే దాన్నేసినిమాగా మలచేవారు. అందులో నా కథ కూడా ఒకటి అచ్చయ్యింది. ప్రతాప్ ఆర్ట్స్ వారి రాఘవ గారికి నా కథ నచ్చి సినిమా తీద్దామని అన్నారు. దర్శకత్వ బాధ్యతలు కూడా నాకే అప్పగిస్తానన్నారు. నాకు అద్భుతమైన అవకాశమనిపించి పని చేయడం మొదలెట్టాను. తాతినేని రామారావు గారొకసారి ఈ సినిమా గురించి విని అడిగితే నేను అమాయకంగా కథ మొత్తం చెప్పేశాను. ఓ రెణ్ణెళ్ళ తర్వాత అమితాభ్ హీరోగా హిందీ సినిమా అంధా కానూన్ విడుదలయ్యింది. నేను చెప్పిన కథే. నేను వెంటనే మద్రాస్ హైకోర్టులో కేసు వేశాను. అప్పట్లో ఇలా కాపీలు కొట్టడం సర్వసాధారణం కానీ కేసు వేసిన వాళ్ళు మాత్రం లేరు. ఆ తర్వాత నన్నొక రెబెల్‌గా ముద్ర వేసి, ఏదైనా అవకాశమిచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్ళు.

గమనిక : ఈ ఇంటర్వ్యూ సీతమ్మ వాకిట్లో సినిమా కి చాలా ముందు జరిగిన సంభాషణల సారాంశం మాత్రమే.

- By Sri Atluri