వివాదాల మంట రాజేసి దాని చుట్టూ చలికాచుకోవడం వర్మకు భలే ఇష్టం. ఎక్కడైతే వివాదస్పదమౌతుందని అంతా భయపడుతుంటారో అక్కడ ఆర్జీవీ ప్రత్యక్షమౌతాడు. అదే కథను ఎంచుకుంటాడు, సినిమా చుట్టేస్తాడు, తన మార్క్ పబ్లిసిటీతో ఊదరగొడతాడు. ఇలా ఇప్పటికే ఆంధ్ర రాజకీయాల్ని, రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని టచ్ చేసిన ఈ వివాదాస్పద దర్శకుడు.. ఇప్పుడు హైదరాబాద్ దాదాలపై కన్నేశాడు.
ఒకప్పుడు రాంగోపాల్ వర్మ తెర వెనుక ఉండేందుకే ఇష్టపడేవారు. ఆయన బుర్ర నుంచి గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. ఇప్పట్లా అప్పట్లో ఇంత పబ్లిసిటీ వ్యామోహం ఉండేది కాదు ఆర్జీవికి. ఇప్పుడు సినిమా క్వాలిటీ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలపైనా ఫోకస్ పెడుతున్నారు.
ఇప్పుడు పాటలు పాడుతున్నారు. రాస్తున్నారు. అంతేకాదు నటిస్తున్నారు కూడా. కోబ్రా అనే సినిమాలో డాన్ గా నటిస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఈయనకి కూడా యాక్టింగ్ బగ్ కుట్టింది అని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపిస్తాడట. ఇతనే కొత్త నటుడు అంటూ తన ఫోటోని షేర్ చేశారు వర్మ.