ఆంధ్రా నుంచి తెలంగాణకు ఆర్జీవీ షిఫ్ట్

వివాదాల మంట రాజేసి దాని చుట్టూ చలికాచుకోవడం వర్మకు భలే ఇష్టం. ఎక్కడైతే వివాదస్పదమౌతుందని అంతా భయపడుతుంటారో అక్కడ ఆర్జీవీ ప్రత్యక్షమౌతాడు. అదే కథను ఎంచుకుంటాడు, సినిమా చుట్టేస్తాడు, తన మార్క్ పబ్లిసిటీతో ఊదరగొడతాడు. ఇలా ఇప్పటికే ఆంధ్ర రాజకీయాల్ని, రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని టచ్ చేసిన ఈ వివాదాస్పద దర్శకుడు.. ఇప్పుడు హైదరాబాద్ దాదాలపై కన్నేశాడు.
అవును.. 1980ల్లో హైదరాబాద్ లో చెలరేగిపోయిన దాదాలపై ఓ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు వర్మ. అందులో హీరోగా జార్జ్ రెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ ను సెలక్ట్ చేసుకున్నాడు. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల్ని ఇప్పటికే టచ్ చేసిన తను, ఇప్పుడు హైదరాబాద్ దాదాలపై సినిమా తీయబోతున్నానంటూ వర్మ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు.
ఎప్పట్లానే ఈసారి కూడా నిజజీవిత పాత్రల్ని ఇందులో పెడతానంటున్నాడు వర్మ. శివ సినిమాలో పాత్రకు ఎవరైతే తనకు స్ఫూర్తిగా నిలిచారో, అదే స్ఫూర్తితో ఓ నిజజీవిత పాత్రను హైదరాబాద్ దాదా కోసం ఎంచుకున్నట్టు ప్రకటించుకున్నాడు వర్మ.
వర్మ సినిమాలు నిజంగానే సంచలనం. కాకపోతే అవి విడుదలకు ముందు మాత్రమే. విడుదల తర్వాత సినిమాల్లో విషయం ఉండదనే విషయం వర్మతో పాటు ప్రేక్షకులందరికీ తెలుసు. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా కూడా ఇదే బాపతు అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు హైదరాబాద్ దాదా అనే సినిమా కూడా ఆ కోవలోకే వస్తుందని విశ్లేషిస్తున్నారు.
- Log in to post comments