దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అనగానే తెల్లగడ్డంతో కూడిన రూపం గుర్తొస్తుంది. ఎపుడూ గడ్డంతోనే ఉంటారాయన. ఐతే ఇపుడు దర్శకేంద్రుడు తన గడ్డాన్ని ప్రత్యేక హోదాకి అర్పించారు. హోదా వచ్చేలా చేయమని తిరుపతి వెంకటేశ్వరుడిని మొక్కుకున్నారాయన.
సాధారణంగా మొక్కు తీరిన తర్వాత తలనీలాలు సమర్పిస్తారు భక్తులు. దర్శకేంద్రుడు మాత్రం ముందే సమర్పయామి అన్నారు. ఇది రివర్స్ మొక్కు. ప్రత్యేకహోదా పోరాటంలో ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, త్వరలోనే రాష్ట్ర ప్రజలు శుభవార్త వింటారనే నమ్మకం ఉందన్నారు. సోమవారం (ఏప్రిల్ 9న) ఆయన తన గడ్డాన్ని అర్పించారు.
తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం చేసినపుడు అక్కడి సినిమా హీరోలంతా వచ్చి మద్దతిచ్చారు. కొందరు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు. మరి తెలుగు హీరోలు ఏం చేస్తున్నారు?. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ టాలీవుడ్ తారలపై తీవ్రస్థాయిలో తెలుగు దేశం నాయకుడు బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు చేశారు. ఉద్యమించకపోతే ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.