సినిమా వాళ్లు ఉద్యమం చేస్తే మీరేం చేస్తారు?

తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం చేసినపుడు అక్కడి సినిమా హీరోలంతా వచ్చి మద్దతిచ్చారు. కొందరు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు. మరి తెలుగు హీరోలు ఏం చేస్తున్నారు?. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ టాలీవుడ్ తారలపై తీవ్రస్థాయిలో తెలుగు దేశం నాయకుడు బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు చేశారు. ఉద్యమించకపోతే ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
అంతా బానే ఉంది కానీ బాబూ రాజేంద్రప్రసాద్ అసలు విషయం చెప్పడం మరిచారు. టాలీవుడ్ స్టార్స్ టీడీపీకి సమస్య వచ్చినపుడే ఉద్యమించాలా లేక స్టేట్ కోసం ఉద్యమించాలా అన్నది క్లారిటీ ఇస్తే బాగుండు అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక నటుడు ఘాటుగా విమర్శించాడు.
జల్లికట్టు స్ఫూర్తితోనే విద్యార్థులు, యువత స్పెషల్ స్టేటస్ కోసం గతేడాది మార్చిలో వైజాగ్‌లో దీక్షకి రెడీ అయ్యారు. ఛలో వైజాగ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. ఆ టైమ్‌లో టాలీవుడ్ తారలు కూడా తమ మద్దతు తెలిపారు. దాదాపుగా ప్రతి హీరో ఆ టైమ్‌లో ట్విట్టర్ ద్వారా తమ మద్దతను ప్రకటించారు. విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ప్రత్యక్షంగా పాల్గొనేందుకు రెడీ అయ్యారు. కానీ అపుడు టీడీపీ ప్రభుత్వం యువతని ఎక్కడికక్కడ నిరోధించింది. ఉద్యమం అక్కర్లేదు అని చెప్పింది.
హోదా కోసం ఉద్యమం అవసరం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తాము తెస్తామని బీరాలు పలికింది చంద్రబాబు ప్రభుత్వం. అపుడు బీజేపీతో అంతా సఖ్యంగా ఉంది టీడీపీకి. ఇపుడు ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చింది. ఇపుడు రాజకీయ లబ్ది కోసం సినిమా వాళ్ళు ఉద్యమం చేయరా అని ప్రశ్నిస్తారా అని సదరు నటుడు మండిపడ్డాడు. టీడీపీ రెండు నాల్కల ధోరణి, బాబు మార్క్ రాజకీయం ఇదని అతను ఘాటుగా విమర్శించాడు.
ప్యాకేజ్ చాలు అని ఒకసారి మీరే అంటారు. ఇపుడు హోదా కావాలి అంటారు. ఏదీ కావాలో తేల్చుకోవడానికి మీకే నాలుగేళ్లు పట్టింది. మరి ఎపుడు టాలీవుడ్ హీరోలు ఉద్యమం చేయలేదో చెప్పండి. మీకు సమస్య వచ్చినపుడు మా వాళ్లు ఉద్యమం చేయాలా?
- Log in to post comments