హీరోయిన్లకే కాదు, హీరోలకు కూడా పవన్ కల్యాణ్ తో నటించాలని ఉంటుంది. పవర్ స్టార్ తో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కలలుకనే హీరోలు కూడా ఉన్నారు. ఆ లిస్ట్ లో నిఖిల్ కూడా ఉన్నాడు. పవన్ తో కలిసి నటించడం ఇతడికి ఎంత ఇష్టం అంటే, అవసరమైతే తన సినిమాను రద్దు చేసుకుంటానని అంటున్నాడు.
"పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే నా సినిమాను కాన్సిల్ చేసుకోవడానికి కూడా రెడీ. అలా చేయడం వల్ల నా నిర్మాతకు నష్టం వస్తుందని తెలుసు. ఆ నష్టాన్ని కూడా నేనే భరిస్తాను. కానీ పవన్ తో కలిసి నటించే ఛాన్స్ ను మాత్రం వదులుకోను."
నిఖిల్ కెరీర్ లోనే చాన్నాళ్లుగా వాయిదాపడుతూ వస్తున్న సినిమా అర్జున్ సురవరం. తమిళ్ లో హిట్ అయిన కణితన్ సినిమాకు రీమేక్ గా, అదే దర్శకుడితో ఈ రీమేక్ ను తెరకెక్కించారు. ప్రమోషన్ కూడా గ్రాండ్ గానే స్టార్ట్ చేశారు. అయితే అంతలోనే అనేక కష్టాలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. సినిమా బడ్జెట్ ఎక్కువవ్వడం, నిర్మాతకు ఆర్థిక కష్టాలు చుట్టుకోవడంతో అనుకున్న టైమ్ కు సినిమా విడుదలకాలేదు. గ్రాఫిక్స్ లేట్ అయ్యాయని, పోస్ట్ ప్రొడక్షన్ అవుతుందంటూ నిఖిల్ కొన్నాళ్లు మేనేజ్ చేస్తూ వచ్చినప్పటికీ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ కాలేదు. దీంతో ఒకదశలో నిఖిల్ కూడా ఈ సినిమాను పక్కనపెట్టేశాడు.