ప్రమోషన్ కి నిఖిల్ ఒప్పుకుంటాడా?

Will Nikhil agree to promotion of Arjun Suravaram
Saturday, October 26, 2019 - 13:15

నిఖిల్ కెరీర్ లోనే చాన్నాళ్లుగా వాయిదాపడుతూ వస్తున్న సినిమా అర్జున్ సురవరం. తమిళ్ లో హిట్ అయిన కణితన్ సినిమాకు రీమేక్ గా, అదే దర్శకుడితో ఈ రీమేక్ ను తెరకెక్కించారు. ప్రమోషన్ కూడా గ్రాండ్ గానే స్టార్ట్ చేశారు. అయితే అంతలోనే అనేక కష్టాలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. సినిమా బడ్జెట్ ఎక్కువవ్వడం, నిర్మాతకు ఆర్థిక కష్టాలు చుట్టుకోవడంతో అనుకున్న టైమ్ కు సినిమా విడుదలకాలేదు. గ్రాఫిక్స్ లేట్ అయ్యాయని, పోస్ట్ ప్రొడక్షన్ అవుతుందంటూ నిఖిల్ కొన్నాళ్లు మేనేజ్ చేస్తూ వచ్చినప్పటికీ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ కాలేదు. దీంతో ఒకదశలో నిఖిల్  కూడా ఈ సినిమాను పక్కనపెట్టేశాడు. కార్తికేయ 2 సినిమాపై ఫోకస్ పెట్టాడు.

అలా చాన్నాళ్లుగా ల్యాబ్ కే పరిమితమైపోయిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 29న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. అర్జున్ సురవరం సినిమాకు ఇలాంటి తేదీలు చాలానే చూశారు జనాలు. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది ప్రారంభం నుంచి నెలకో తేదీ వినిపిస్తూనే ఉంది. అయితే ఈసారి వచ్చిన రిలీజ్ డేట్ అలాంటిది కాదంటున్నాడు నిర్మాత ఠాగూర్ మధు. సినిమాకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమైనట్టు ఆఫ్ ది రికార్డు చెబుతున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ ప్రచారానికి ఇప్పుడు హీరోహీరోయిన్లు సహకరిస్తారా అనేది అందరి డౌట్. ఎందుకంటే.. నిఖిల్ ఇప్పటికే విసిగిపోయాడు. అటు లావణ్య త్రిపాఠి కూడా ప్రమోషన్ కు వస్తుందో రాదో అనే డౌట్ ఉంది. నిఖిల్ ప్రోమోట్ చెయ్యక తప్పదు. లేదంటే అతనికే బాడ్ నేమ్ వస్తుంది.