మీటూ: సంజనకి దెబ్బ!

మీ టూ... ఉద్యమం కొందరికి ప్రచారస్త్రంగా మారిపోయింది. ఈ ఉద్యమం గాడి తప్పుతోందని, నిజంగా బాధితులైన యువతులని కూడా నమ్మలేని పరిస్థితులు కొందరు తీసుకువస్తున్నారనే అభిప్రాయం వెల్లడవుతోంది.
మీటూ అనేది మంచి ఉద్యమం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ కల్చర్‌కి చరమగీతం పాడాల్సిన టైమ్ ఇది. అందుకే మీటూ ఉద్యమానికి అంత మంచి స్పందన, మద్దతు వచ్చింది. ఐతే ఈ ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్న వాళ్లూ ఉన్నారు. ‘మీ టూ’ అనేది ఏదో బాగుందే మనమూ మాట్లాడేసి కూసింత క్రేజ్ సంపాదించుకోవాలని చూసేవాళ్ళు లేకపోలేదు. ఇలాగే ప్రయత్నం చేసిన నటి బుజ్జిగాడు భామ సంజనకు కొత్త తిప్పలు వచ్చి చివరకు చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.
ఈ కన్నడ నటి తెలుగులో చెప్పుకోవడానికి కాస్త పెద్ద సినిమా బుజ్జిగాడు మాత్రమే ఉంది. అదీ కథానాయిక ఏమీ కాదు త్రిష సిస్టర్ గా చేసింది. ఆ తరవాత ఎన్ని సినిమాలు చేసినా హిట్ లేదు. కన్నడలోనూ ఈ నాయికకు దక్కిన హిట్లు చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. ఆ మధ్య దండుపాళ్యం సిరీస్ లో చేసి నగ్నంగా నటించాను అంటూ ప్రచారం చేసుకున్నా ఏమీ ప్రయోజనం చేకూరలేదు. ఓ వైపు నటిస్తూనే మరో వైపు వ్యాపారం మొదలుపెట్టింది... పవర్ యోగా సెంటర్ పెట్టి. ఈ మధ్య ఈటీవీలో వస్తున్న సీరియల్ లో నటిస్తున్నా.. సినిమా మాదిరి అందచందాలు ఆరబోస్తున్నా రేటింగ్ రావడం లేదు.
ఈలోగా మీ టూ హడావిడి మొదలైంది. సంజన మీడియా ముందుకు వచ్చి తాను నటించిన తొలి సినిమా ‘గండ హెండతి’ సమయంలో దర్శకుడు రవి శ్రీవాత్సవ వేధించారని, అసభ్యంగా నటించేలా ఒత్తిడి చేశారని ఆరోపించింది.
ఆ సినిమా మర్డర్ అనే మసాలా హింది సినిమా రీమేక్. అందులో అలాంటి ఘాటు సీన్లు ఉంటాయని తెలియదా? అవేమీ తెలియకుండానే సినిమా ఒప్పుకున్నావా? ఇది ప్రచారం కోసం చేస్తున్న ఆరోపణలా అంటూ సంజనను కన్నడ సినిమావాళ్లేకాదు సోషల్ మీడియా జనాలు ప్రశ్నించారు. రవి శ్రీవాత్సవ మీద చేసి ఆరోపణలపై కన్నడ దర్శకుల సంఘం సీరియస్ అయ్యింది. సంజన క్షమాపణలు చెబితే తప్ప కన్నడ సినిమాల్లో నటించనీయం అని ప్రకటించింది. మాజీ మంత్రి, నటుడు అంబరీష్ కూడా సంజనకు ఫుల్ క్లాస్ పీకడంతో – ఆరోపణలు చేసి మూడు వారాల తరవాత నా ఉద్దేశం అది కాదు అంటూ చెంపలు వేసుకొంది.
ఏదో కాస్తంత క్రేజ్ పొందాలి అనుకొంటే ఇలా పోయింది పాపం.
- Log in to post comments