జబర్దస్త్ రేటింగ్ ఎందుకు తగ్గింది?

Why Jabaradasth rating is decreasing?
Friday, July 3, 2020 - 17:00

కరోనాకు ముందు సంగతి. ప్రతి వారం వచ్చే రేటింగ్స్ చార్ట్ చూస్తే టాప్-10లో కచ్చితంగా కనిపించే పేరు జబర్దస్త్. ఆ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ అలాంటిది. భారీ సినిమాలు, కార్తీకదీపం లాంటి సీరియల్స్ తో పోటీపడి మరీ టీఆర్పీ సాధించేది జబర్దస్త్. కానీ ఎందుకో గ్యాప్ ఇచ్చిన తర్వాత జబర్దస్త్ కు ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు.

షూటింగ్ లేకపోవడంతో దాదాపు 3 నెలలుగా జబర్దస్త్ ప్రసారంకాలేదు. పాత ఎపిసోడ్స్ నే రకరకాల పేర్లు పెట్టి తిప్పితిప్పి వేశారు. ఎప్పుడైతే షూటింగ్స్ కు అనుమతి వచ్చిందో, వెంటనే కొత్త ఎపిసోడ్స్ రెడీ చేశారు. అలా 25వ తేదీన జబర్దస్త్, 26వ తేదీన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రసారమయ్యాయి. కానీ ఈ రెండింటికీ రేటింగ్స్ అంతంతమాత్రంగానే వచ్చాయి. జబర్దస్త్ కు 5.31 (అర్బన్+రూరల్) రేటింగ్ వస్తే, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు 5.85 టీఆర్పీ వచ్చింది.

లాక్ డౌన్ కు ముందు వచ్చిన టీఆర్పీలతో పోల్చి చూసుకుంటే ఇది చాలా తక్కువ. రేటింగ్ ఎందుకు తగ్గిందనే అంశంపై ప్రస్తుతం ప్రొడక్షన్ హౌజ్ లో సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. ప్రధానంగా ఓ కారణం మాత్రం అంతా చెబుతున్నారు. అదేంటంటే.. కొత్త ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నామనే విషయాన్ని మేకర్స్ సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయారట.

దీనికితోడు లాక్ డౌన్ టైమ్ లో పాత ఎపిసోడ్స్ వేయడంతో అభిమానులు "జబర్దస్త్"కు దూరమయ్యారు. కొత్త ఎపిసోడ్స్ ప్రసారమైన తర్వాత కూడా చాలామంది వాటిని పాత ఎపిసోడ్స్ గా భావించి స్కిప్ చేసినట్టు మినిట్-టు-మినిట్ ఇంప్రెషన్స్ చూస్తే అర్థమౌతోంది.

మొత్తానికి సమస్య ఎక్కడుందో కనుక్కున్నారు. దాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

|

Error

The website encountered an unexpected error. Please try again later.