బన్నీ "పరుగు"కు పుష్కరం

12 years of Allu Arjun's Parugu
Friday, May 1, 2020 - 18:15

బన్నీ హీరోగా నటించిన సినిమా పరుగు. దిల్ రాజు బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ఇవాళ్టితో (మే 1) 12 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు.

నిజానికి ఇది బన్నీకి కలిసొచ్చిన సినిమా కాదు. అతడి కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా అంతకంటే కాదు. అప్పటికే దేశముదురు లాంటి మాస్ సినిమా.. హ్యాపీ-ఆర్య లాంటి లవ్ స్టోరీస్ చేసిన బన్నీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన సినిమా ఇది. ఈ సినిమా అతడికి రికార్డుల్ని అందించకపోయినా.. అతడు ఆశించినట్టు కుటుంబ ప్రేక్షకులకు మాత్రం దగ్గరచేసింది.

షీలా హీరోయిన్ గా పూనమ్ బజ్వా, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. "నమ్మవేమో గానీ" అనే పాట ఈ సినిమాలోనిదే. ఇప్పటికీ ఈ పాట వస్తుందంటే చాలు మెలొడీ ప్రేమికులు అలా ఓ చెవి అటు పడేస్తారు. అంత పెద్ద హిట్టయింది ఈ సాంగ్.

ఇక ఈ సినిమా 2008 నంది అవార్డుల్లో మూడో ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వడంతో పాటు.. బన్నీకి స్పెషల్ జ్యూరీ అవార్డ్ తెచ్చిపెట్టింది. ఇదే సినిమాతో బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ సౌత్ అవార్డు కూడా అందుకున్నాడు బన్నీ.