టాలీవుడ్ కు వెరీ వెరీ స్పెషల్

19 years for Kushi
Monday, April 27, 2020 - 17:15

ఈరోజు లాక్ డౌన్. టాలీవుడ్ లో ఎలాంటి సందడి లేదు. కానీ చరిత్రలోకి తొంగిచూస్తే ఈరోజుకు చాలా ప్రాముఖ్యం కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఎన్నో హంగులున్నాయి టాలీవుడ్ లో. ఒక్కొక్కటిగా చూద్దాం

సరిగ్గా 19 ఏళ్ల కిందట ఇదే రోజు పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా రిలీజైంది. అప్పటికే తొలిప్రేమ, తమ్ముడు, సుస్వాగతం సినిమాలతో పవన్ క్రేజ్ ఆకాశాన్నంటింది.  అయితే ఎప్పుడైతే ఖుషీ వచ్చిందో, అప్పట్నుంచి తమ్ముడు, సుస్వాగతం లాంటి సినిమాల గురించి ఫ్యాన్స్ మాట్లాడ్డం మానేశారు. అంతలా పవన్ ఇమేజ్ ను రెట్టింపు చేసింది ఖుషీ. సినిమాలో పవన్ కాస్ట్యూమ్స్, వాడిన బ్యాగ్, షూజ్, చెప్పిన డైలాగ్స్.. ఇలా ఒక్కటేంటి అన్నీ సూపర్ హిట్. ఎస్ జే సూర్య డైరక్ట్ చేసిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.

సరిగ్గా 13 ఏళ్ల కిందట ఇదే రోజు మరో కల్ట్ మూవీ కూడా రిలీజైంది. అదే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఎమోషన్స్ సరిగ్గా పండితే, ఫ్యామిలీ డ్రామా కనెక్ట్ అయితే వెంకటేష్ ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో చెప్పడానికి ఈ సినిమా ప్రత్యక్ష ఉదాహరణ. లవ్, ఎమోషన్ ను పెర్ ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ సెల్వరాఘవన్ తీసిన ఈ సినిమా అప్పట్లో కుటుంబప్రేక్షకులతో కంటతడి పెట్టించింది. వెంకీ-కోట శ్రీనివాసరావు మధ్య వచ్చే సీన్స్ అయితే హార్ట్ టచింగ్ అంతే.

సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట ఇదే రోజు మరో సూపర్ హిట్ కూడా వచ్చింది. దాని పేరు ఘటోత్కచుడు. అన్నీతానై ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్టయింది. ఘటోత్కచుడిగా కైకాల సత్యనారాయణ, కామెడీ విలన్ గా ఏవీఎస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్స్. ఇక రోబోను కూడా చూపించడం, నాగార్జునతో స్పెషల్ సాంగ్ పెట్టడం ఈ సినిమాలో ఎట్రాక్షన్స్.

నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఘరానా బుల్లోడు కూడా ఇవాళ్టికి 25 ఏళ్లు పూర్తిచేసుకుంది. జట్కా రాజు పాత్రలో నాగార్జున పక్కా మాస్ రోల్ పోషించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లుగా నటించారు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సినిమాలో భీమవరం బుల్లోడా అనే పాట ఇప్పటికీ హిట్టే. విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ సినిమా 20 సెంటర్లలో వంద రోజులాడి సూపర్ హిట్ గా నిలిచింది.