భుజం తడితే ఆ కిక్కే వేరు

Adivi Sesh recalls working with Pawan Kalyan
Monday, June 15, 2020 - 16:45

తనతో నటించిన నటీనటులందరిపై తనదైన ముద్ర వేస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ తో వర్క్ చేసిన అనుభవాన్ని నటీనటులంతా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆయన మృదు స్వభావాన్ని, యాటిట్యూడ్ ను మెచ్చుకోని ఆర్టిస్టు లేరు. ఇప్పుడీ ఫ్యాన్ గ్రూప్ లోకి అడివి శేష్ కూడా చేరిపోయాడు. పవన్ తో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు.

"పవన్ కల్యాణ్ గారితో పంజా చేశాను. అలా అని ఆయన గురించి తెలుసు అని చెప్పను. చాలా తక్కువ తెలుసు. అది నా రెండో సినిమా మాత్రమే. ఓరోజు సడెన్ గా కల్యాణ్ గారు నా దగ్గరకొచ్చి అడివి బాపిరాజుగారి చుట్టానివా నువ్వు అని అడిగారు. అవును అన్నాను. అంతే.. ఇక అడివి బాపిరాజు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన రాసిన పుస్తకాలు నేను సగం కూడా చదవలేదు. కల్యాణ్ గారు మాత్రం మొత్తం చదివేశారు."

తనతో నటించిన ప్రతి ఒక్కర్ని పవన్ బాగా చూసుకుంటారని అంటున్నాడు అడవి శేష్. అయితే అందరికీ టచ్ లోకి వెళ్లరని, ఫోన్ నంబర్ కూడా ఇవ్వరని అన్నాడు. తనకు కూడా ఫోన్ నంబర్ ఇవ్వలేదన్నాడు. పవన్ తనను మెచ్చుకున్న విషయాన్ని ఎప్పటికీ మరిచిపోనంటున్నాడు శేష్.

"కర్మ సినిమా చూశాను. బాగుంది. నాకు నచ్చింది. కొత్తగా ఉంది. సినిమాలు తీయడం మాత్రం మానేయకు అంటూ భుజం తట్టారు. అది నేను మరిచిపోలేను."

పవన్ తో కలిసి మళ్లీ నటించడానికి తను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, అట్నుంచే తనకు ఇప్పటివరకు కాల్ రాలేదంటున్నాడు అడివి శేష్.