మమ అనిపించిన "ఆహా"!

Aha went for soft launch on Ugadi
Thursday, March 26, 2020 - 17:15

లెక్కప్రకారం ఈ పాటికి తెలుగు ప్రపంచం మొత్తం ఆహా గురించే మాట్లాడాలి. టాలీవుడ్ లో ఆహా అనే హ్యాష్ ట్యాగ్ ఓ రేంజ్ లో వైరల్ అవ్వాలి. కానీ కరోనా వచ్చి మొత్తం కడిగిపారేసింది. ఇదంతా అల్లు అరవింద్ కు చెందిన ఆహా అనే యాప్ ముచ్చట

ట్రయల్ రన్ లో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా యాప్ ను లాంఛ్ చేశారు. సినిమా వసూళ్లు చెప్పినట్టు తమకొచ్చిన సబ్ స్కైబర్ల లెక్క చెప్పి బాగానే ఊదరగొట్టారు. ఇక ఉగాది రోజున భారీ ఈవెంట్ ప్లాన్ చేసి, అధికారికంగా స్ట్రీమింగ్ యాప్ ను మార్కెట్లోకి తీసుకెళ్లాలని అనుకున్నారు.

ఈ మేరకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ లాంటి హీరోల డేట్స్ కూడా సంపాదించారు. ఇదే వేదికపై నుంచి అల్లు అర్జున్ చేసిన యాడ్ ను కూడా లాంఛ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా అల్లు అరవింద్ ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది.  

ఇక చేసేదేం లేక ఉగాది రోజున వెబ్ కాస్టింగ్ (దాదాపు వీడియో కాన్ఫరెన్స్ లాంటిది) ద్వారా మమ అనిపించారు. రెండు ఒరిజినల్ కంటెంట్ ను లాంఛ్ చేసినట్టు ప్రకటించి, వాటి ట్రయిలర్స్ కూడా రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. అలా గ్రాండ్ గా వద్దామనుకున్న అల్లు అరవింద్ ఆశల్ని కరోనా వమ్ముచేసింది. అల్లు అరవింద్, మై హోమ్ గ్రూప్ కలిసి మొదలు పెట్టిన కంపెనీ ఇది.