'సినిమా కష్టాలు' చెప్పిన ఐశ్వర్య

Aishwarya Rajesh's Ted talk goes viral
Thursday, May 28, 2020 - 08:15

"చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. 12 ఏళ్ళకి అన్న కన్ను మూశాడు. మరి కొన్నాళ్ళకు తమ్ముడు కూడా చనిపోయాడు. అమ్మ మంచాన పడింది. ఇంటి భారం అంతా నా పైనే..." - ఇలా ఉండేవి ఒకప్పుడు సినిమా హీరోల, హీరోయిన్ల మాటలు, కథలు. అందుకే ఎవరైనా తమ పేదరికం గురించి చెప్పాల్సి వస్తే... సినిమా కష్టాలు మావి అనడం పరిపాటి అయింది. 

కానీ ఒక హీరోయిన్ నిజ జీవితంలో అచ్చంగా ఇలాగే జరిగింది. ఆమె పేరు ... ఐశ్వర్య రాజేష్. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి. 

చెన్నైలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు చిన్నప్పుడు పుట్టేడు కష్టాలు చూసింది. ఆమె త్రండి రాజేష్ పేరున్న నటుడే. కానీ ఆమె చిన్నప్పుడు చనిపోయాడు. ఆమె మేనత్త శ్రీ లక్ష్మి .... తెలుగులో ఫేమస్ కమెడియన్. ఐతే, రాజేష్ చనిపోవడం, అప్పులు పెరిగిపోవడంతో ఆ కుటుంబం కష్టాలు పాలు అయింది. అన్న, తమ్ముడు కూడా దుర్మరణం పాలు అయ్యారు. దాంతో 16 ఏళ్లకే పని చెయ్యడం మొదలు పెట్టింది ఐశ్వర్య రాజేష్. 

Aishwarya Rajesh

'కనా' (తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి) సినిమాతో హీరోయిన్ గా స్థిర పడింది. ఇప్పుడు తమిళ్ లో మంచి అభినయం ఉన్న పాత్రలకు కేరాఫ్. తెలుగు అమ్మాయే కానీ తెలుగులో ఇంకా సరైన బ్రేక్ రాలేదు. విజయ్ దేవరకొండ సరసన నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' విజయం సాధించలేదు. 

సేల్స్ గర్ల్ గా ఫస్ట్ జాబ్. ఆ తర్వాత బుల్లి తెరపై యాంకర్. అదృష్టం కలిసొచ్చి ...సినిమా నటి అయింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సెక్సువల్ వేధింపులు, తన నల్లని మేని ఛాయ గురించి ఈసడింపులు షరా మామూలే.

ఇప్పుడు ఆమెకి 30 ఏళ్ళు. జీవితంలో స్థిర పడింది. నాలాంటి అమ్మాయే ఇంత సాధించినప్పుడు ఎవరైనా ఏమైనా చెయ్యగలరు, దేనికి భయపడొద్దు... జీవితంలో కుంగిపోవద్దు అంటూ టెడ్ టాక్ లో ఆమె చేసిన స్పీచ్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్. 

Aishwarya Rajesh