కాజోల్ కు కరోనా? అజయ్ క్లారిటీ

Ajay Devgn responds rumors about Kajol
Tuesday, March 31, 2020 - 17:45

కరోనా రావడం కాదు కానీ, కరోనా కంటే వేగంగా దానికి సంబంధించి పుకార్లు మాత్రం దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు కరోనాతో ముడిపెట్టి వస్తున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. మొన్నటికిమొన్న కమల్ హాసన్ విదేశాల నుంచి వచ్చి, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాడంటూ పుకార్లు వచ్చాయి. స్వయంగా కమల్ వాటిపై స్పందించి అలాంటిదేం లేదని స్పష్టంచేశాడు. ఇప్పుడు బాలీవుడ్ నటి కాజోల్ కు కరోనా అంటూ కొత్త పుకారు మొదలైంది.

కాజోల్ తో పాటు ఆమె కూతురుకు కరోనా సోకిందని, ప్రస్తుతం ఇంట్లోనే వాళ్లిద్దరికీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారంటూ బాలీవుడ్ లో గాసిప్స్ ఊపందుకున్నాయి. మరి కాజోల్ భర్త అజయ్ దేవగన్ ఆరోగ్య పరిస్థితేంటంటూ లేనిపోని కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై అజయ్ దేవగన్ క్లారిటీ ఇచ్చాడు.

తన భార్య కాజోల్ కు, కూతురికి కరోనా సోకిందంటూ వచ్చిన వార్తల్ని అజయ్ దేవగన్ ఖండించాడు. కాజోల్, నైసా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, వాళ్లపై వచ్చిన కరోనా పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంచేశాడు. ప్రస్తుతం ఈ హీరో.. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అజయ్ దేవగన్ తెలుగులో చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే.