నన్ను వదిలేయండి ప్లీజ్

Ajith refrains from entering social media
Sunday, March 8, 2020 - 13:15

ఇదిగో అజిత్ అంటే.. అదిగో అఫీషియల్ ఎకౌంట్ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ హీరో సోషల్ మీడియాలోకి రాబోతున్నాడంటూ ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు అజిత్ ఖండిస్తూనే ఉన్నాడు. అయితే ఈసారి ఈ పుకార్లు పీక్ స్టేజ్ కు చేరాయి. ఏకంగా అజిత్ పేరిట ఓ లెటర్ నెట్ లో ప్రత్యక్షమైంది. దీంతో ఏకంగా తన లీగల్ టీమ్ ను రంగంలోకి దించాడు అజిత్.

తను త్వరలోనే సోషల్ మీడియాలోకి రాబోతున్నానని, ఓ అఫీషియల్ ఎకౌంట్ కూడా తెరవబోతున్నానని అజిత్ పేరిట ఓ లెటర్ ప్రత్యక్షమైంది. అందులో అజిత్ సంతకం కూడా ఉంది. చూడ్డానికి అంతా ఒరిజినల్ గా ఉండడంతో అభిమానులు కూడా అదే నిజమని నమ్మారు. నిన్నట్నుంచి ఆ లెటర్ ఒకటే వైరల్ అవుతోంది. దీనిపై అజిత్ లీగల్ టీమ్ సీరియస్ గా స్పందించింది.

ఈరోజు ఓ పబ్లిక్ నోటీసు జారీ చేసింది అజిత్ లీగల్ టీమ్. తమ క్లయింట్ అజిత్ పేరిట రిలీజైన లేఖ నకిలీదని స్పష్టం చేసింది. అంతేకాదు.. నకినీ లెటర్ హెడ్ తయారుచేసి పుకార్లు వ్యాప్తిచెందించిన వ్యక్తికి లీగల్ నోటీసు ఇస్తామని కూడా ప్రకటించాడు. పనిలోపనిగా అజిత్ సోషల్ మీడియా ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అజిత్ కు ఎలాంటి సోషల్ మీడియాలో ఎకౌంట్స్ లేవని, భవిష్యత్తులో కూడా సోషల్ మీడియాలోకి వచ్చే ఆలోచన అజిత్ కు లేదని అందులో స్పష్టంచేశారు అజిత్ లాయర్లు. ఈ పబ్లిక్ నోటీసుతో అజిత్ పై నిన్నటివరకు వచ్చిన పుకార్లకు చెక్ పడింది.