గ్యాప్ వచ్చింది.. బుట్ట రాలేదు

Ali laments that Pawan Kalyan didn't send him mangoes this time
Monday, June 1, 2020 - 22:15

రాజకీయంగా ఇప్పుడు పవన్-అలీ మధ్య గ్యాప్ వచ్చింది. పవన్ ది జనసేన పార్టీ. అలీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో.. ఇద్దరూ రాజకీయ శత్రువులన్నమాట. వ్యక్తిగత స్థాయిలో వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈసారి తనకు పవన్ నుంచి మామిడి పండ్లు అందలేదంటున్నారు అలీ.

"ప్రతి సంవత్సరం చిరంజీవి ఇంటి నుంచి నాకు ఆవకాయ జాడీ వస్తుంది. పవన్ కల్యాణ్ నుంచి నాకు ప్రతి ఏటా మామిడ పండ్ల బుట్ట వస్తుంది. వాళ్ల ఫామ్ హౌజ్ లో పండించిన ఆర్గానిక్ మామిడి పండ్లు అవి. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు కాబట్టి ఈ ఏడాది నాకు బుట్ట అందలేదు. బహుశా వచ్చే ఏడాది వస్తుందేమో."

ఇలా పవన్ కు తనకు మధ్య ఉన్న గ్యాప్ ను పరోక్షంగా బయటపెట్టారు అలీ. మరోవైపు పవన్ తో తన స్నేహబంధం ఎలా మొదలైందనే విషయాన్ని కూడా బయటపెట్టారు అలీ. పవన్ తో చేసిన ప్రతి సినిమాను గుర్తుచేసుకున్నారు.

"గోకులంతో సీతతో మేం కలిశాం. ఆ తర్వాత సుస్వాగతం సినిమా చేశాం. ఆ తర్వాత తొలిప్రేమ చేశాం. తొలిప్రేమ నుంచి మేం బాగా కలిసిపోయాం. అక్కడ్నుంచి మా కాంబినేషన్ ప్రతి సినిమాతో రిపీట్ అయింది. పవన్ తో నాది లాస్ట్ కాంబినేషన్ కాటమరాయుడు. పవన్ మొదటి సినిమాలో నేను లేను. ఆయన నటించిన 25వ చిత్రం అజ్ఞాతవాసిలో లేను. మధ్యలో ప్రతి సినిమాలో ఉన్నాను."

పవన్ కు తనకు మధ్య కొన్ని సైగలు నడుస్తాయంటున్నారు అలీ. తన సైగలు పవన్ కు అర్థమౌతాయని.. మూడో వ్యక్తికి అర్థంకావని అన్నారు. అందుకే మేం ఎందుకు నవ్వుకుంటున్నామో చాలామందికి అర్థం కాదన్నారాయన. తామిద్దరి మధ్య అంత మంచి కమ్యూనికేషన్ ఉండేదని చెప్పుకొచ్చారు అలీ. మరి గత ఏడాది ఎన్నికల టైంలో అలీ సైగలు పవన్ కి అర్థం కాలేదా? అందుకే అలీ జన సేనాని క్యాంపు నుంచి జంప్ అయ్యాడా?