అల్లు అరవింద్ కు ఝలక్ ఇచ్చిన మమ్ముట్టి

Allu Aravind reveals a secret about Mammootty
Tuesday, December 3, 2019 - 23:00

ఇది గాసిప్ కాదు, జరిగి చాన్నాళ్లయింది. పైగా ఎవరో చెబితే నమ్మలేం కానీ స్వయంగా అల్లు అరవిందే చెప్పుకొచ్చారు. అవును.. మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి తనకు ఝలక్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. మామాంగం ట్రయిలర్ లాంఛ్ సందర్బంగా అప్పటి ఆ ఘటనను గుర్తుచేసుకున్నారు.

"స్వాతికిరణం కోసం మమ్ముట్టిని తీసుకున్నప్పుడు.. అదేంటి ఓ మలయాళ నటుడిని తీసుకొస్తున్నారు, తెలుగు ప్రేక్షకులకు ఆయన పాత్ర కనెక్ట్‌ అవుతుందో లేదో అన్నాను. నిజానికి అప్పటికి ఆయన అంత పెద్ద నటుడని నాకు తెలియదు. కానీ, ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు కనీసం లేచి నిలబడలేకపోయా. అంత గొప్పగా నటించారాయన. తర్వాత ఓసారి పవన్‌ కల్యాణ్‌ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో విలన్ పాత్ర కోసం మమ్ముట్టికి ఫోన్ చేశా. విలన్ పాత్ర ఒకటుంది చేయాలని కోరాను. దానికాయన ‘ఇదే మాట చిరంజీవిని అడుగుతారా’ అని ప్రశ్నించారు. వెంటనే ఫోన్ పెట్టేశాను."

ఇలా మమ్ముట్టి తన నుంచి మరో  మాట బయటకు రాకుండా చేశారని అల్లు అరవింద్ గుర్తుచేసుకున్నారు. మమ్ముట్టి నటించిన మామాంగం సినిమాను తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.