స్టేజి పైనే ఏడ్చేసిన బన్ని

Allu Arjun turns emotional about father Allu Aravind
Tuesday, January 7, 2020 - 09:15

అల్లు అర్జున్ కూడా ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి అల్లు అరవింద్ ని తలుచుకొని ఏడ్చేశాడు. అంతే కాదు తన తండ్రికి పద్మశ్రీ రావాల్సిన అవసరం ఉందన్నాడు. సినిమా ఇండస్ట్రీకి ఆయన కాంట్రిబ్యూషన్ అలాంటిది అని చెప్పాడు. "నాన్న గురించి నేను, నాగురించి నాన్న ఎప్పుడూ స్టేజ్‌పై చెప్పుకోలేదు. న‌న్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నే. స‌భాముఖంగా ఆయ‌న‌కు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలేదు. కానీ ఈరోజు ఆయ‌న‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు కొడుకు పుట్టిన త‌ర్వాత అర్థ‌మైంది ఒక‌టే. నేను మా నాన్నంత గొప్ప‌గా ఎప్పుడూ కాలేను. ఆయ‌న‌లో స‌గం కూడా కాలేను. నాన్న‌లో స‌గం ఎత్తుకు ఎదిగితే చాల‌నే ఫీలింగ్ క‌లుగుతుంది. మా నాన్న‌ను నేను ప్రేమించినంత‌గా మ‌రేవ‌రినీ ప్రేమించ‌ను," అంటూ ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్. 

"పెళ్లైన త‌ర్వాత నా భార్య‌ను నేను అడిగింది ఒకే ఒక‌టి. నాకెన్ని కోట్లు ఉన్నా.. మా నాన్న ఇంట్లోనే ఉంటాన‌ని. మా నాన్నంటే అంత ఇష్టం. నేను చాలా మందిని చూసుంటాను. నేను చూసిన వారిలో ది బెస్ట్ ప‌ర్స‌న్ మానాన్నే. పది రూపాయ‌ల వ‌స్తువుని ఏడు రూపాయ‌ల‌కు బేరం చేసిన త‌ర్వాత ఆరు రూపాయ‌లు ఇవ్వండి అన్నా.. వాళ్లింటికి వెళ్లి ఏడు రూపాయ‌లు ఇచ్చేసే వ్య‌క్తి మా నాన్న‌గారు. 45 ఏళ్లుగా ఓ వ్య‌క్తి సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మ‌నిషిలో ప్యూరిటీ లేక‌పోతే మ‌నిషి ఇవాళ సౌత్ ఇండియాలో, ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ ప్రొడ్యూస‌ర్ గా ఉండ‌లేరు.మా తాత‌గారికి ప‌ద్మ‌శ్రీ వ‌చ్చింది. అలాగే మా నాన్న‌గారికి కూడా ప‌ద్మ‌శ్రీ రావాల‌నే కోరిక ఉండేది. కాబ‌ట్టి మా నాన్న‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ఇవ్వాల‌ని  స‌భావేదిక నుండి ప్ర‌భుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయ‌న అందుకు అర్హుడు. ఇండ‌స్ట్రీకి ఎంతో సేవ చేశారు," అని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. 

అలాగే త్రివిక్రమ్ తో తన అనుబంధాన్ని కూడా గొప్పగా చెప్పారు. 

"త్రివిక్ర‌మ్‌గారి గురించి చెప్పాలంటే.. ఆయ‌నంటే ఏంతో ఇష్టం.  నేను ఈరోజు ఇలా ఉన్నానంటే బ‌ల‌మైన కార‌ణం ఆయ‌న‌. నాకు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. నా ప్ర‌తి ఇష్టాన్ని త్రివిక్ర‌మ్‌గారు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఎంత చేసినా, ఎంత పేరు తెచ్చుకున్నా అది త్రివిక్ర‌మ్‌గారి వ‌ల్లే. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇంత గ్యాప్ వ‌చ్చిన త‌ర్వాత కూడా నా ఫ్యాన్స్ కార‌ణంగానే నాకు ఈ గ్యాప్ వ‌చ్చిన‌ట్లు అనిపించ‌లేదు. ఎవ‌రికైనా ఫ్యాన్స ఉంటారు. కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంది. నాకు చిరంజీవి గారంటే ప్రాణం.  ఈ క‌ట్ట కాలేంత వ‌ర‌కు చిరంజీవిగారి అభిమానినే. చిరంజీవిగారి త‌ర్వాత నాకు ఇష్ట‌మైన వ్య‌క్తి ర‌జినీకాంత్‌గారే. అలాంటి ర‌జినీకాంత్‌గారి సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఇష్ట‌మైన డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌గారు చేసిన సినిమా. ఈ సంక్రాంతికి  ఆయ‌న సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. అలాగే మా సినిమాతో పాటు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా కూడా విడుద‌ల‌వుతుంది. మ‌హేశ్‌గారు స‌హా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. అలాగే నాకు ఎంతో ఇష్ట‌మైన వ్య‌క్తి క‌ల్యాణ్‌రామ్‌గారి ఎంత‌మంచివాడ‌వురా సినిమా విడుద‌ల‌వుతుంది. ఆయ‌న‌కు కూడా అభినంద‌న‌లు. ఈ సంక్రాంతి అంద‌రికీ బావుండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.