అమృతరామమ్ మూవీ రివ్యూ

Amrutha Ramam - Movie Review
Wednesday, April 29, 2020 - 17:45

(రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరో, హీరోయిన్లుగా సురేందర్‌ కొంటడ్డి దర్శకత్వంలో ఎస్‌ఎన్‌ రెడ్డి నిర్మించిన చిత్రం "అమృత రామమ్. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రాన్ని నిర్మాతలు జీ5 యాప్ లో ఏప్రిల్ 29న విడుదల చేశారు.)

కథ

మన హీరోయిన్ అమృత (అమితా రంగనాథ్) చదువుకునేందుకు ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్తుంది. అక్కడ తొలిచూపులోనే రామ్ (రామ్ మిట్టకంటి)ని ప్రేమిస్తుంది. కానీ అమృత మనస్తత్వం కాస్త భిన్నంగా ఉంటుంది. ఏదైనా అనుకుంటే అది జరిగిపోవాలి. దేన్నయినా అతిగా ప్రేమించడం ఈమెకు అలవాటు. రామ్ ను కూడా అలానే ప్రేమిస్తుంది. అమృత అతి వల్ల రామ్ ఇబ్బందులు పడుతుంటాడు. ఇలాంటి అమ్మాయిని ప్రేమించానా అని బాధపడుతుంటాడు. చివరికి ఓ సందర్భంలో బ్రేకప్ చెప్పేయడానికి కూడా రెడీ అయిపోతాడు. అయితే అదే టైమ్ లో కొన్ని ఊహించని ఘటనలు జరుగుతాయి. ఇంతకీ అమృత-రామ్ కలిశారా లేదా అనేది ఈ అమృతరామమ్.

రివ్యూ
అమ్మాయిల వెంట అబ్బాయిలు పడడం, వాళ్ల ప్రేమను పొందడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఫర్ ఏ ఛేంజ్ ఈ సినిమాలో అబ్బాయి వెంట అమ్మాయి పడుతుంది. అతడ్ని అతిగా ప్రేమించేస్తుంది. అమ్మాయిలు ఎక్స్ ట్రీమ్ లెవెల్లో ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. బహుశా దర్శకుడు సురేష్ కు ఈ పాయింట్ కొత్తగా అనిపించి ఉండొచ్చు. కానీ అలా కొత్తగా అనిపించిన పాయింట్ ను కొత్తగా ప్రజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు.

సినిమా మొత్తం బోర్ కొడుతుంది. 2 ఎమోషనల్ సీన్స్ మినహాయిస్తే ఇక దేనితో కనెక్ట్ అవ్వలేని పరిస్థితి. దీనికితోడు ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ ఎందుకు తీసుకున్నారో, అసలు ఈ ప్రేమకథ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవ్వరికీ అర్థం కాదు. బహుశా విదేశీ లొకేషన్లయితే ఫ్రెష్ గా, కొత్తగా ఉంటుందని దర్శకుడు భావించి ఉండొచ్చు. అలాంటప్పుడు కనీసం అవైనా చూపించాలి కదా. ఆస్ట్రేలియా వెళ్లి మరీ నాలుగు గోడల మధ్య సినిమా తీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు.

టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ, ఫీచర్ ఫిలింకు తక్కువ అన్నట్టు ఉంటుంది. చాలా సీన్లు మరీ నాసిరకంగా ఉన్నాయి. దర్శకుడు కథను చెప్పిన విధానం, అతడు రాసుకున్న సీన్స్, డైలాగ్స్ ఏవీ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వవు. ఎడిటర్ కార్తీక్ 2 గంటల్లోపే సినిమాను ముగించాడు. కానీ 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందంటే అది దర్శకుడి తప్పే. ప్రసు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల అది ఎలివేట్ కాలేకపోయింది. కెమెరావర్క్ అంతంతమాత్రం.

ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే అమృత పాత్ర పోషించిన అమిత రంగనాథ్ మినహా మరెవ్వరూ చెప్పుకోదగ్గ స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా హీరో ఈ సినిమాకు డ్రాబ్యాక్ అయ్యాడు. అంత అందమైన అమ్మాయి, పనీపాట లేని ఓ యువకుడ్ని తొలిచూపులోనే ప్రేమించి, వాడికోసం పడిచచ్చే రేంజ్ కు వెళ్లిందంటే.. ఆ హీరో ఎలా ఉండాలి.. సింపుల్ గా చెప్పాలంటే మహేష్ బాబు అంత అందగాడై ఉండాలి. రామ్ పాత్ర ఆ మీటర్ అందుకోలేకపోయింది. అందుకే హీరోయిన్ పదేపదే లవ్ ఎమోషన్స్ చూపించినా, వీడి కోసమా ఇంత పాకులాట అనే ఫీలింగ్ చూసేవాడికి వస్తుంది.

ఓవరాల్ గా ఓటీటీలో విడుదలైన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమాగా కాస్త బజ్ క్రియేట్ చేసిన అమృతరామమ్.. ఇంట్లో కూర్చున్న ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమాలో ఏ కొత్తదనం లేకపోయినా, లవ్ స్టోరీ కాబట్టి ఆ ఎమోషన్ ఉంటుందని ఆశించిన ఆడియన్స్ కు భంగపాటు తప్పదు. ఓటీటీలో ఉంది కాబట్టి చూడాలా వద్దా అనేది మీ ఇష్టం.

బాటమ్ లైన్: రామమ్ కష్టం

Rating: 1.5/5