తప్పు ఒప్పుకున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi realises his mistake
Monday, January 6, 2020 - 17:45

"వర్క్ పరంగా, వ్యక్తిగతంగా నిన్న నాకు చాలా పెద్ద రోజు. నిన్నటి రోజున వచ్చిన ప్రశంసలు, శుభాకాంక్షలు నన్ను ఎంతో కదిలించాయి. అదే సందర్భంలో నా మొదటి హీరో, నిర్మాత కల్యాణ్ రామ్ పేరును ప్రస్తావించడం మరిచిపోయాను. పొరపాటున అలా జరిగింది. ఎంతమంచివాడవురా సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."

అనిల్ రావిపూడి పెట్టిన ట్వీట్ ఇది. నిజానికి ఈ దర్శకుడు ఈ సందర్భంలో కల్యాణ్ రామ్ గురించి ఇంత ప్రత్యేకంగా ట్వీట్ ఎందుకు పెట్టాడా అని చాలామంది ఆలోచించారు. కల్యాణ్ రామ్ పై తనకున్న అభిమానాన్ని అనీల్ రావిపూడి చాటుకున్నాడని కొందరన్నారు. కానీ అసలు విషయం వేరు. ఒక్కసారి రాత్రి జరిగిన సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ ను రిపీట్ చేసుకోండి. మీకే అర్థమౌతుంది.

సుదీర్ఘంగా ప్రసంగించిన చిరంజీవి, సంక్రాంతి సినిమాలను ప్రస్తావించారు. అన్ని సినిమాలు ఆడాలని కోరుకున్నారు. కానీ ఆయనకు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు తప్ప మిగతా 2 సినిమాలు స్ఫురణకు రాలేదు. పక్కనే ఉన్న అనీల్ రావిపూడి దర్బార్ సినిమా పేరు గుర్తుచేశాడు. వెంటనే చిరంజీవి ఆ సినిమా పేరు చెప్పారు. అదే టైమ్ లో కల్యాణ్ రామ్ మూవీ గురించి చిరంజీవికి గుర్తుచేయలేకపోయాడు రావిపూడి.

ఈ విషయంపై నందమూరి అభిమానులు సీరియస్ అయ్యారు. దర్బార్ గుర్తొచ్చింది కానీ నీకు లైఫ్ ఇచ్చిన కల్యాణ్ రామ్ సినిమా గుర్తుకురాలేదా అంటూ రాత్రి నుంచే ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో ఆఘమేఘాల మీద ఇలా ట్వీట్ వేశాడు అనిల్ రావిపూడి.