బాలయ్యతో కామెడీ అంటే మరి!

Anil Ravipudi's tough job with Balayya
Saturday, August 1, 2020 - 17:15

బాలయ్య సినిమాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటే ఎవరికైనా కళ్ల ముందు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు, మాస్ డైలాగులు, నరుక్కోవడాలు, తొడ కొట్టడాలు.. ఇవన్నీ వన్ బై వన్ కళ్లముందు కదుల్తాయి. కానీ ఈ సీక్వెన్స్ లో ఎక్కడా బాలయ్య కామెడీ చేస్తున్న సీన్ మాత్రం స్ఫురణకు రాదు. అలాంటి హీరోతో కామెడీ స్పెషలిస్ట్ అనీల్ రావిపూడి సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో సరికొత్త చర్చకు తెరలేచింది.

మొదటి సినిమా "పటాస్" నుంచి తాజాగా వచ్చిన "సరిలేరు నీకెవ్వరు" వరకు అనీల్ రావిపూడి ఎక్కడా తన బ్రాండ్ కామెడీ మిస్ అవ్వలేదు. చివరికి మహేష్ లాంటి హీరోను పెట్టి మరీ కామెడీ పండించాడంటే ఈ దర్శకుడికి ఆ సెగ్మెంట్ అంటే ఎంతిష్టమో, ఆ సెగ్మెంట్ పై ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి అనీల్ రావిపూడి, బాలయ్యతో ఎలా కామెడీ పండిస్తాడనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. దీనికి కారణం అనీల్-బాలయ్య కాంబోలో సినిమా రాబోతోందనే ప్రచారమే. సినిమా ఓకే అవుతుందా అవ్వదా అనే విషయం పక్కనపెడితే.. బాలయ్యతో మూవీ ఓకే అయితే అనీల్ మాస్ హీరో బాలయ్యతో ఎలా కామెడీ పండిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వెంకటేష్ కు కామెడీలో పీహెచ్ డీ ఉంది కాబట్టి అనీల్ పని ఈజీ అయింది. వరుణ్ తేజ్ కు తెలంగాణ యాస యాడ్ చేసి మాయచేశాడు. ఇక రవితేజ, సాయితేజ్, కల్యాణ్ రామ్, మహేష్ లాంటి హీరోలతో కూడా అనీల్ కు సమస్య రాలేదు. ఎటొచ్చి రౌద్రానికి కేరాఫ్ గా ఉండే బాలయ్యతోనే ఆయన (ఒకవేళ మూవీ ఓకే అయితే) ఎలా కామెడీ పండిస్తాడో చూడాలి.