కీర్తి సురేష్ కేరాఫ్ ఓటీటీ!

Are Kerthy Suresh lady-oriented films going OTT way?
Friday, May 29, 2020 - 12:15

"మహానటి" సినిమాతో టాలీవుడ్ లో పిచ్చ పాపులరైంది కీర్తిసురేష్. ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని చాలామంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కూడా. అయితే కీర్తి క్రేజ్ మొత్తం ఇప్పుడు ఓటీటీకే పరిమితమయ్యేలా ఉంది. అవును.. ఆమె నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా ఇప్పుడు ఓటీటీ ముందు క్యూ కట్టాయి.

కీర్తిసురేష్ నటించిన "పెంగ్విన్" అనే సినిమా ఆల్రెడీ ఓటీటీకి వెళ్లిపోయింది. వచ్చేనెల 19న ఆ సినిమాను ప్రీమియర్ మూవీగా స్ట్రీమింగ్ చేయబోతోంది అమెజాన్ ప్రైమ్. ఇక నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఆమె చేస్తున్న "గుడ్ లక్ సఖి" అనే సినిమా కూడా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొంత పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత మూవీ డీల్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక కీర్తిసురేష్ నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా "మిస్ ఇండియా". నరేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. "గుడ్ లక్ సఖి" సినిమా ఓటీటీకి వెళ్లే అవకాశాలున్నాయి. "మిస్ ఇండియా"పై మహేష్ కోనేరు అన్ని ఆప్షన్స్  (OTT ప్లస్ థియేటర్లో విడుదల) చూస్తున్నారు. ఏదీ ఇంకా ఫైనల్ కాలేదు.