మరో క్రికెట్-బాలీవుడ్ ప్రేమకథ

Athiya Shetty's love story
Saturday, May 9, 2020 - 16:30

క్రికెట్ ఫీల్డ్ కు బాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి కనెక్షన్ ఉంది. అప్పుడెప్పుడో మొదలైన పటౌడీ లవ్ స్టోరీ నుంచి నిన్నమొన్నటి విరాట్ కోహ్లి-అనుష్క శర్మ ప్రేమకథ వరకు.. ఈ రెండు రంగాల మధ్య బంధం గట్టిగా పెనవేసుకొని ఉంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో ప్రేమకథ నడుస్తోంది. అవును.. సునీల్ షెట్టి కూతురు అతియాశెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ చాలా డీప్ గా డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ టాక్.

నిజానికి మొన్నటివరకు కేఎల్ రాహుల్, నిధి అగర్వాల్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని నిధి అగర్వాల్ ఖండించింది. అంతలోనే.. రాహుల్-అతియా వ్యవహారం బయటకొచ్చింది. నిజానికి వీళ్లిద్దరిదీ కొత్త పరిచయం కాదు. దాదాపు ఏడాదిగా ఒకరికొకరు పరిచయం. ఇప్పుడు ఆ పరిచయం కాస్తా నెక్ట్స్ లెవెల్ కు చేరిందంటోంది బాలీవుడ్.

అతియా షెట్టి ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో మెల్లగా అడుగులు వేస్తోంది. హీరో, ముబారకాన్, నవాబ్ జాదే లాంటి సినిమాల్లో కనిపించింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా ఇప్పుడు రాహుల్ పైనే ఆమె ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కంటే ముందు ఇద్దరూ కలిసి ఫారిన్ టూర్ కూడా వెళ్లారని చెబుతోంది బాలీవుడ్ మీడియా.

బాలీవుడ్-క్రికెట్ బంధాల్లో ఎక్కువ శాతం వీగిపోయినవే. పెళ్లి వరకు వెళ్లి సుఖాంతం అయినవి చాలా తక్కువ. చాలామటుకు రిలేషన్ షిప్స్ అన్నీ షార్ట్ టర్మ్ కే పరిమితం. మరి వీళ్ల బంధం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.