తెలుగు టీవిలో అవెంజర్స్ హల్చల్

Avengers End game gets great TRP on Telugu TV
Friday, May 29, 2020 - 17:15

టీవీ రేటింగ్స్ లో ఎప్పుడూ స్టార్ హీరోల సినిమాలదే టాప్. హయ్యస్ట్ టీఆర్పీలు వాటికే వస్తుంటాయి. డబ్బింగ్ సినిమాలు టాప్ లో నిలిచిన దాఖలాల్లేవు. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాలు రేటింగ్స్ లో అగ్రస్థానం మాత్రం ఎప్పుడూ దక్కలేదు. మొదటిసారి ఓ సినిమా చరిత్ర సృష్టించింది. టీఆర్పీల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దాని పేరు "ఎవెంజర్స్-ఎండ్ గేమ్". లాక్ డౌన్ మహత్యం ఇదంతా.

బుల్లితెరపై స్పైడర్ మేన్, సూపర్ మేన్, బ్యాట్ మేన్ నుంచి ఎక్స్-మెన్ వరకు ఎన్నో ప్రతిష్టాత్మక డబ్బింగ్ సినిమాలు ప్రసారమయ్యాయి. జేమ్స్ బాండ్, టామ్ క్రూస్ మూవీస్ కు కూడా ఎప్పుడూ నంబర్ వన్ రేటింగ్ రాలేదు. కానీ ఈనెల 17న స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేసిన ఎవెంజర్స్-ఎండ్ గేమ్ కు మాత్రం రికార్డ్ స్థాయిలో 5.09 రేటింగ్ రావడం విశేషం. ఓ ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో రేటింగ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్.

లాక్ డౌన్ కావడం, ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ లేకపోవడం వల్ల థానోస్ కు పట్టంకట్టారు బుల్లితెర వీక్షకులు. అలా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగు టీవీ తెరపై కూడా క్లిక్ అయింది.

ఇక ఈ వారం టాప్-5 సినిమాల్లో ఎండ్ గేమ్ తర్వాత స్థానంలో "90ఎంఎల్ నిలిచింది. ఇప్పటికే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కింద రికార్డ్ రేటింగ్ సాధించిన ఈ సినిమా, ఈవారం కూడా నంబర్ వన్ స్థానంలో నిలిచి ఉండేది. కానీ ఎవెంజర్స్ వల్ల తృటిలో ఆ ఛాన్స్ తప్పిపోయి, 5.07 టీఆర్పీతో రెండో స్థానంలో నిలబడాల్సి వచ్చింది. ఇక మూడో స్థానంలో లక్ష్మీకల్యాణం, నాలుగో స్థానంలో డాడీ, ఐదో స్థానంలలో పౌర్ణమి  సినిమాలు నిలిచాయి