నేనేదో బ్రహ్మాండంగా పాడలేదు కానీ...!

Balakrishna talks about his singing
Thursday, June 11, 2020 - 17:00

తెలుగు సినీచరిత్రలోనే క్లాసిక్ గా పేరుతెచ్చుకున్న పాట "శివశంకరీ". "జగదేకవీరునికథ" సినిమాలోని ఈ పాటను తాజాగా బాలయ్య పాడారు. పాడారు అనడం కంటే ఖూనీ చేశారు అనడం కరెక్ట్. అంతలా ఈ పాటపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో తను పాడిన పాటపై బాలయ్య స్పందించారు.

"మా హీరోలంతా కాఫీల మీద, టీ మీద, మందు మీద పాటలు పాడారు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక పట్టుదల. ఓ ఛాలెంజింగ్ సాంగ్ తీసుకొని పాడాలని. ఏం.. నేను పాడలేనా అనిపించింది. అందుకే ఆ పాట ఎంచుకున్నాను. నాలో ఉన్న ఆ పట్టుదలే ఈ పాట పాడించింది. నేనేదో బ్రహ్మాండంగా పాడానని చెప్పను కానీ ఓ ప్రయత్నం చేశాను."

ఆవేశం అనేవి తనకు కొట్టినపిండి అని.. ధైర్యసాహసాలకు మారుపేరు నందమూరి వంశం అనే విషయం అందరికీ తెలుసని.. అందుకే ఆ మొండి ధైర్యంతోనే పాట పాడేశానన్నారు బాలయ్య. తన పాటను అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

తన షష్టిపూర్తి వేడుకలకు ముగింపుగా ఓ వీడియో రిలీజ్ చేసిన బాలయ్య అందులో ఇలా తన పాటను సమర్థించుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవికి కూడా వీడియోలో థ్యాంక్స్ చెప్పారు.