కరోనా కన్నా ముందే చేశా: బాలయ్య

Balakrishna talks about limited crew on the sets
Tuesday, June 2, 2020 - 12:45

బోయపాటికి తనకు ఉన్న అండర్ స్టాండింగ్ పై రియాక్ట్ అయ్యాడు బాలయ్య. తన గెటప్ నుంచి బోయపాటికి కథ పుట్టుకొస్తుందంటున్నాడు. గతంలో తామిద్దరం కలిసి చేసిన "సింహా", "లెజెండ్" సినిమాలకు కూడా తన గెటప్స్ నుంచే బోయపాటి కథ రాసుకున్నాడని చెప్పుకొచ్చాడు.

"నా సినిమాలకు సంబంధించి బోయపాటి ఏం చేస్తాడంటే.. గెటప్ నుంచి సబ్జెక్ట్ సృష్టిస్తాడు. ఎప్పుడైనా మీసాలు బాగా పెంచినప్పుడు తిరిగి కట్ చేసే టైమ్ లో వస్తాడు. ఏదో ఒక షేప్ కోసం కట్ చేస్తుంటారు. సడెన్ గా ఏదో చూస్తాడు. "బ్రహ్మాండంగా ఉంది బాబు.. ఈ గెటప్ ఇలా ఉంచేయండి నాకు కథ వచ్చేసింది" అంటాడు. ఆయన అంతకుమించి ఆలోచించడు. బోయపాటికి నాకు ఉన్న అండర్ స్టాండింగ్ అలా ఉంటుంది."

కరోనా పూర్తిస్థాయిలో దేశంలో విస్తరించకుముందే వ్యక్తిగతంగా తాను చర్యలు చేపట్టానంటున్నాడు బాలయ్య. తక్కువమంది యూనిట్ సభ్యులతో ఫస్ట్ షెడ్యూల్ చేశామంటున్నాడు. ఇప్పుడు అంతా తన పద్ధతిలోకి వస్తున్నారని అన్నాడు.

"కరోనా రాకముందే యూనిట్ ను కట్టడి చేసింది నేనే. లొకేషన్ లో నాకు 50 మంది కంటే ఎక్కువ కనిపించకూడదని ఆర్డర్ పాస్ చేశాను. 50-70 మందితో బోయపాటి సినిమా ఫస్ట్ షెడ్యూల్ చేశాం. ఇప్పుడేమో అందరూ వచ్చి కరోనా వచ్చింది, 70 మందితోనే చేయాలంటున్నారు. ఈ పని నేను అప్పుడే చేశాను."

ఇక మల్టీస్టారర్లపై స్పందిస్తూ తనకు వాటిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని ప్రకటించాడు. ఒకవేళ మంచి కథ దొరికితే కల్యాణ్ రామ్ లేదా ఎన్టీఅర్ తో కలిసి నటించడానికి అభ్యంతరం కూడా లేదన్నాడు. తను మల్టీస్టారర్ చేయాలంటే ఆ సినిమా షోలే టైపులో భారీ ఎత్తున, భారీ స్థాయిలో ఉండాలన్నారు బాలయ్య.