బెలూన్ - మూవీ రివ్యూ

Balloon (Zee5) - Movie Reivew
Saturday, July 11, 2020 - 12:45

"బెలూన్"  (ఫ్లాట్ ఫామ్: జీ5)

బెలూన్.. ఈ సినిమా ఇప్పటిది కాదు. జై-అంజలి రియల్ లైఫ్ లో ప్రేమించుకుంటున్న టైమ్ లో వచ్చింది. తమిళనాట 2017లోనే రిలీజైంది. నిజానికి ఈ సినిమా ఆ టైమ్ లోనే తెలుగులో కూడా రిలీజై ఉంటే కాస్తోకూస్తో ఆకట్టుకునేది. కానీ ఈ మూడేళ్లలో హారర్ జానర్ లో చాలా మార్పులు జరిగి ఇది రొటీన్ బెలూన్ అనిపించుకుంది.

కృష్ణ అలియాస్ కిట్టు (జై) డైరక్టర్ అవుదాం అనుకుంటాడు. ఓ కథ పట్టుకొని నిర్మాత చుట్టూ తిరుగుతుంటాడు. నిర్మాత మాత్రం హారర్ కథ అయితేనే చేస్తానంటాడు. హీరో కూడా రెడీ అని చెబుతాడు. దీంతో తనకు ఇష్టం లేకపోయినా హారర్ కథ రాసేందుకు రెడీ అవుతాడు క్రిష్ణ. ఫేస్ బుక్ లో చూసిన ఓ పాడుబడిన హౌస్ అతడ్ని ఆకర్షిస్తుంది.

అరకులో ఉన్న ఆ పాడుబడిన ఇంటికి వెళ్తే తన కథకు లైన్ దొరుకుతుందని స్నేహితులు, భార్య జెన్నిఫర్ (అంజలి), అన్నయ్య కొడుకు పప్పుతో కలిసి అక్కడికి వెళ్తాడు. కట్ చేస్తే.. కృష్ణ ఏ దెయ్యం గురించి రీసెర్చ్ చేయాలనుకుంటున్నాడో అదే దెయ్యం, అతడి భార్యని, పప్పుని ఆవహిస్తుంది. అంతేకాదు.. కృష్ణ రీసెర్చ్ చేస్తున్న దెయ్యంతో, అతడికి కూడా కనెక్షన్ ఉంటుంది. ఇంతకీ ఏంటా కనెక్షన్.. ఈ సినిమాకు బెలూన్ కు సంబంధం ఏంటనేది అసలు కథ.

హారర్ ఎలిమెంట్స్ జోడించే క్రమంలో అసలు లైన్ ను వదిలేసి దర్శకుడు కత్తిమీద సాము చేశాడు. మెయిన్ పాయింట్ చుట్టూ రకరకాల సబ్-ప్లాట్స్ రాసుకున్నాడు. అవి ఆసక్తికరంగా అనిపించకపోవడమే ఈ సినిమాకు మైనస్ పాయింట్. ఇంతకుముందే చెప్పుకున్నట్టు పాత చింతకాయపచ్చడి లాంటి రివెంజ్-డ్రామాకు కామెడీ ఎలిమెంట్ యాడ్ చేయడానికి దర్శకుడు పడిన పాట్లు చూస్తే నవ్వొస్తుంది. కామెడీ ట్రాక్ కంటే.. అది రాయడం కోసం దర్శకుడు చేసిన విశ్వప్రయత్నం నవ్వు తెప్పిస్తుంది.

యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టెక్నికల్ గా ఈ సినిమా కాస్త బెటర్ గా అనిపిస్తుంది. శరవణన్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా మిక్స్ అవ్వడంతో 2-3 సీన్లు నిజంగానే భయపెడతాయి. అంతకుముంచి బెలూన్ లో చెప్పుకోదగ్గ మెరుపుల్లేవు.

బాధాకరమైన విషయం ఏంటంటే... ఒకప్పటి రియల్ లైఫ్ ప్రేమజంట అంజలి-జై ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని కూడా దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు. యోగిబాబు కామెడీపై పెట్టిన దృష్టిని, హీరోహీరోయిన్ల రొమాన్స్ పై పెట్టి ఉంటే ప్రేక్షకుడికి పైసా వసూల్ అనిపించేది. కానీ ఉన్నంతలో అంజలి, జై ఆకట్టుకున్నారు. ఎటొచ్చి ఈ షేడ్స్ జనాలకు కొత్త కాదు. అందుకే ఈ బెలూన్ పూర్తిగా ఎగరకుండా మధ్యలోనే తుస్సుమంది. రాజ్ తరుణ్ వచ్చి కాస్త సర్ ప్రైజ్ అనిపించినప్పటికీ.. మూవీకి అదనపు అడ్వాంటేజ్ ఏమి తేలేదు. 

బాటమ్ లైన్: ఎగరని బెలూన్
రేటింగ్: 2/5

Review by: MK


నటీనటులు: జై, అంజలి, యోగిబాబు, నాగినీడు, జాయ్‌ మాథ్యూ, మాస్టర్ రిషి తదితరులు
సినిమాటోగ్రాఫర్: ఆర్‌. శరవణన్‌
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాత: మహేష్ గోవిందరాజ్క
థ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శినీష్ శ్రీధరన్ర
న్ టైమ్: 2 గంటల 13 నిమిషాలు
రిలీజ్ డేట్: జులై 10, 2020
ఫ్లాట్ ఫామ్: జీ5