క్రాక్ లో బలుపు

Balupu sentiment in Ravi Teja's Crack
Saturday, February 15, 2020 - 09:15

ప్రస్తుతం రవితేజ హీరోగా క్రాక్ అనే సినిమా తీస్తున్నాడు గోపీచంద్ మలినేని. తన సినిమాల్లో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి ఇష్టపడే గోపీచంద్.. రవితేజ కోసం కూడా అలాంటి స్క్రిప్టే రాసుకున్నాడు. రియల్ లైఫ్ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నానని చెప్పినప్పటికీ, మాస్ రాజా కోసం అన్ని ఎలిమెంట్స్ దట్టించాడు. ఈ క్రమంలో గతంలో మాస్ రాజాతో తీసిన బలుపు, డాన్ శీను సినిమాల ఫ్లేవర్ ను కూడా క్రాక్ లో చూపించబోతున్నాడు.

రవితేజ ఎనర్జీని ఫుల్లుగా ఎలివేట్ చేసిన సినిమాల్లో డాన్ శీను, బలుపు కూడా ఉన్నాయి. క్రాక్ లో కూడా ఈ సినిమా ఛాయలు కనిపిస్తాయి. అసలే హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్నాడు రవితేజ. అతడ్ని వింటేజ్ లుక్ లో చూపించాలన్నా.. హిట్ ట్రాక్ లోకి తీసుకురావాలన్నా ఈమాత్రం పాత వాసనలు ఉండాల్సిందే. అందుకే బలుపు తరహాలోనే క్రాక్ లో కూడా రవితేజ-బ్రహ్మానందం ట్రాక్ పెట్టాడు గోపీచంద్.

ఇదే తరహాలో డాన్ శీనులోని కొన్ని ఎపిసోడ్స్ ను కూడా క్రాక్ కోసం వాడుకుంటున్నారు. హిట్ కోసం ఇలా పాత సినిమాల్లోని హిట్ ట్రాక్స్ ను వాడుకోవడంలో తప్పులేదు. కానీ అది కూడా రొటీన్ అనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. అందరికీ క్రాక్ తెప్పిస్తుంది.