కరోనా దెబ్బకి బండ్లకి జ్ఞానోదయం!

Bandla Ganesh says corona has changed his perceptions
Thursday, July 9, 2020 - 13:15

సరిగ్గా 2 నెలల కిందటి సంగతి... 

హరీష్ శంకర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు నిర్మాత బండ్ల గణేశ్. హరీశ్ కు సంస్కారం లేదన్నాడు. అతడికి పవన్ సినిమాను డైరక్ట్ చేసే అవకాశం తన వల్ల వచ్చిందన్నాడు. దీనికి హరీష్ కూడా కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ఆ టైమ్ లో వీళ్లిద్దరూ బద్ధ శత్రువులయ్యారు.

కట్ చేస్తే, బండ్ల ఇప్పుడు మళ్లీ మాట మార్చాడు.

హరీష్ ను గతంలో తను విమర్శించిన మాట వాస్తవమే అన్న బండ్ల.. ప్రస్తుతం అతడిపై తనకు ఎలాంటి కోపం లేదంటున్నాడు. పైపెచ్చు, హరీష్ ను తన తమ్ముడిగా చెప్పుకొచ్చాడు.

"అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు రావా? కొన్ని రోజులకు కలిసిపోతారు. నేను-హరీష్ కూడా అంతే. నేను ఒక్కోసారి మా భార్యతో మాట్లాడను, పిల్లలతో మాట్లాడను, ఆమధ్య మా అమ్మతో 2 రోజులు మాట్లాడలేదు. అలాఅని వాళ్లకు దూరమైపోతానా. హరీష్ కూడా అంతే. హరీష్ నాకు తమ్ముడు లాంటోడు."

హరీష్ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడని, కుదిరితే తన బ్యానర్ పై అతడితో మరో సినిమా చేస్తానంటున్నాడు బండ్ల గణేశ్. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఈ నిర్మాత.. తనకు కరోనా వచ్చిపోయిన తర్వాత జీవితం అంటే ఏంటో తెలిసొచ్చిందని, ఇకపై వివాదాలకు దూరంగా, అందరితో ప్రేమగా ఉంటానంటున్నాడు.

అన్నట్లు ఇలా మారిపోయాను.. వివాదాలకు దూరంగా ఉంటాను అని అనడం రెండోసారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ పైన, టీఆరెస్ పైన వీరంగం వేసి... ఎన్నికల ఫలితాలతో గూబ వాయాడంతో ... ఇకపై కాంట్రవర్సీలు చెయ్యనని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ కరోనా దెబ్బకి వివాదాల  మూతికి మాస్క్ వేసుకుంటాను అంటున్నాడు.