ఆన్ లైన్లో బండ్ల తీన్మార్

Bandla Ganesh's teenmar online
Tuesday, April 14, 2020 - 15:15

ఈరోజు ఉదయం నుంచి బండ్ల గణేష్ ఒకటే పని పెట్టుకున్నాడు. తను నిర్మించిన "తీన్ మార్" సినిమాను ఆన్ లైన్లో పొగడ్డమే పనిగా పెట్టుకున్నాడు. ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు "తీన్ మార్" పై ఈ నిర్మాత అంత ప్రేమ కురిపించడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమా వచ్చి సరిగ్గా 9 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్న బండ్ల.. ఈ లాక్ డౌన్ టైమ్ లో "తీన్ మార్" ను మరోసారి చూసి ఎంజాయ్ చేయమని అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నాడు.

తన "దేవుడు" పవన్ హీరోగా నిర్మించిన తీన్ మార్ సరిగ్గా ఆడలేదని విషయాన్ని ఒప్పుకున్నాడు బండ్ల. కానీ ఆ సినిమా షూటింగ్ ఎక్స్ పీరియన్స్, అందులో డైలాగ్స్, పవన్ యాక్టింగ్ తనకు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా మైఖేల్ వేలాయుధంగా, అర్జున్ పాల్వాయ్ గా పవన్ యాక్టింగ్ అద్భుతం అంటున్నాడు.

ఈ సందర్భంగా తనకు సంబంధించి రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు బండ్ల గణేష్. నిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యే ఈ నిర్మాత... ఇకపై అందర్నీ ప్రేమిస్తానని, తనను 1శాతం ప్రేమిస్తే, తను అవతలి వ్యక్తిని వందశాతం ప్రేమిస్తానని అన్నాడు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఇకనైనా అంతా తనను ప్రేమించాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు