బిగ్ బాస్ కు కరోనా దెబ్బ

Bigg Boss Season 4 affected by Corona?
Wednesday, May 6, 2020 - 19:15

లెక్కప్రకారం ఈపాటికి బిగ్ బాస్ సీజన్ -4 హంగామా స్టార్ట్ అవ్వాలి. కంటెస్టెంట్లు ఎవరనే అంశంపై రోజుకో పేరు తెరపైకి రావాలి. కానీ ఇప్పటివరకు నాలుగో సీజన్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. దీనికి ప్రధాన కారణం కరోనా.

అవును.. కరోనా వల్ల లాక్ డౌన్ వచ్చింది. దీంతో బిగ్ బాస్ సీజన్-4పై స్టార్ మా యాజమాన్యం వర్క్ చేయడం ఆపేసింది. నిజానికి వర్క్ ఫ్రమ్ హోం మాడ్యూల్ లో కూడా ఈ ఎంపిక కార్యక్రమాన్ని పూర్తిచేయొచ్చు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఈ కాన్సెప్ట్ లోనే కరోనా ఉంది.

బిగ్ బాస్ హౌజ్ లో ఓ 13-14 మంది కొన్ని రోజుల పాటు కలిసి ఉండాలి. బిగ్ బాస్ వాళ్లకు రకరకాల టాస్క్ లు ఇస్తాడు. అవన్నీ వాళ్లు పూర్తిచేయాలి. ప్రతి వారం ఓ ఎలిమేషన్ ఉంటుంది. అదే విధంగా మధ్యమధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. కరోనా వైరస్ మరికొన్ని నెలల పాటు ఉంటుందనే అంచనాల మధ్య ఇలా ఇంతమందిని తీసుకొచ్చి ఓ గదిలో పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని యాజమాన్యం భావిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ కరోనా దెబ్బకు సెలబ్రిటీలు కూడా హౌజ్ లోకి రావడానికి ఒప్పుకోకవచ్చు.