ఈ బాలీవుడ్ కు ఏమైంది?

Bollywood lost four celebrities in two months
Sunday, June 14, 2020 - 22:45

ఆమధ్య టాలీవుడ్ లో వరుసగా దుర్వార్తలు విన్నాం. ప్రముఖులు, మరీ ముఖ్యంగా కమెడియన్లు వరుసగా కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ కు ఏదో అయిందంటూ ఒకటే చర్చ. సేమ్ టు సేమ్ ఇలాంటి డిస్కషన్ ఇప్పుడు బాలీవుడ్ పై కూడా నడుస్తోంది. వరుసపెట్టి హిందీ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఏప్రిల్ 29న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో ఇర్ఫాన్ ఖాన్ ను కోల్పోయింది బాలీవుడ్. అరుదైన కాన్సర్ వ్యాధితో పోరాడుతూ.. 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు ఇర్ఫాన్. మొదటి సినిమా సలామ్ బాంబే నుంచి తనదైన ముద్ర వేశారు ఇర్ఫాన్. కొన్ని పాత్రల్ని ఆయన మాత్రమే చేయగలరనే ఇమేజ్ ను సంపాదించుకున్నారు.

ఇర్ఫాన్ కన్నుమూసిన 24 గంటల వ్యవథిలోనే మరో లెజండరీ నటుడ్ని కోల్పోయింది బాలీవుడ్. అతడి పేరు రిషి కపూర్. సినీవారసత్వాన్ని కొనసాగిస్తూ అడుగుపెట్టిన రిషికపూర్.. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రొమాంటిక్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రిషి కపూర్ ది ఓ చరిత్ర. ఏప్రిల్ 30న ఈయన కన్నుమూశారు.

ఇక జూన్ 1న స్టార్ మ్యూజిక్ డైరక్టర్ వాజిద్ ఖాన్ కన్నుమూశాడు. సాజిద్-వాజిద్ సంగీత ద్వయం బాలీవుడ్ లో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. సూపర్ హిట్టయిన ఓ 10 పాటలు తీసుకుంటే.. అందులో కనీసం 5 పాటలు వీళ్లవే ఉంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా బాలీవుడ్ మ్యూజిక్ పై తనదైన ముద్రవేసిన వాజిద్ ఖాన్ 42 ఏళ్ల వయసులో కిడ్ని సమస్యతో కన్నుమూశాడు.

రిషికపూర్, వాజిద్ ఖాన్ లేరనే విషయాన్ని ఇప్పుడిప్పుడు జీర్ణించుకుంటున్న బాలీవుడ్ కు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రూపంలో మరో కోలుకోలేని షాక్ తగిలింది. కేవలం 34 ఏళ్ల చిన్న వయసులో జూన్ 14న కన్నుమూశాడు సుశాంత్. టెలివిజన్ నుంచి సిల్వర్ స్క్రీన్ పైకి ఎంతో కష్టపడి ఎదిగాడు సుశాంత్. ప్రతి సినిమాలో తన మార్క్ చూపించాడు. చిచోర్, శుద్ధ్ దేశీ రొమాన్స్, ధోనీ సినిమాలతో సుశాంత్ దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు.

ఇలా కేవలం 2 నెలల వ్యవథిలో నలుగురు సినీప్రముఖుల్ని కోల్పోయింది బాలీవుడ్.