నాన్నమ్మతో కలిసి వెన్న చిలికిన చెర్రీ

Charan makes butter
Friday, May 1, 2020 - 17:00

లాక్ డౌన్ టైమ్ లో హీరోలంతా సరదాగా కాలం గడిపేస్తున్నారు. మహేష్ అయితే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి పిల్లలతోనే గడిపేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ భార్యకు డిన్నర్ చేసి పెట్టడం, కుటుంబ సభ్యులందరితో కలిసుండడం, వాళ్లకు సహాయం చేయడం చేస్తున్నాడు. ఈ క్రమంలో వెన్న ఎలా తయారుచేస్తారో తెలుసుకున్నాడు చరణ్.

తల్లి సురేఖ, నాన్నమ్మ అంజనాదేవి వెన్న చిలుకుతుంటే చరణ్ కూడా మధ్యలో దూరాడు. వెన్న ఎలా తయారుచేయాలో నేర్చుకున్నాడు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న నాన్నమ్మ, కృష్ణుడిలా ఉన్నావంటూ చరణ్ ను చూసి మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు. అవసరం మేరకు మాత్రమే రియాక్ట్ అవుతాడు. దీనికి పూర్తి భిన్నంగా చిరంజీవి మాత్రం ఓ రేంజ్ లో యాక్టివ్ అయ్యారు. రోజుకో పోస్టుతో అదరగొడుతున్నారు. ఈ లాక్ డౌన్ టైమ్ లో చరణ్ కూడా తండ్రి బాటలోకి వచ్చినట్టున్నాడు. సరదా సరదా పోస్టులు పెడుతూ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు.