రిటైర్మెంట్ ప్రకటించిన చార్మి

Charmme announces retirement from acting.
Monday, May 18, 2020 - 09:30

ఈమధ్య కాలంలో తెరపై ఎక్కడా కనిపించలేదు చార్మి. పూర్తిగా నిర్మాణ బాధ్యతలకే పరిమితమైంది. అలా ప్రొడక్షన్ లో బిజీ అయిన చార్మి ఇక మళ్లీ తెరపై కనిపించడం కష్టమే అంటున్నారు చాలామంది. ఇప్పుడు అదే విషయాన్ని చార్మి కూడా చెబుతోంది. ఇకపై తను నటించడనని క్లారిటీ ఇచ్చేసింది.

"ఇకపై సిల్వర్ స్క్రీన్ పై కనిపించను. జ్యోతిలక్ష్మి టైమ్ లోనే రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నాను. పూరి జగన్నాధ్, సి.కల్యాణ్ వారించారు. యాక్టింగ్ మానేయాలనుకుంటే మానేసెయ్, దానికి ఎనౌన్స్ మెంట్ ఎందుకు అన్నారు. అలా యాక్టింగ్ కు దూరమైపోయాను. ఆ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను, ఇకపై నేను నటించను."

జ్యోతిలక్ష్మి లాంటి మరో మంచి పాత్ర దొరికితే ఆమె మళ్లీ ముఖానికి రంగేసుకుంటుందని చాలామంది భావించారు. స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం కూడా ఉందన్నారు మరికొందరు. కానీ చార్మి మాత్రం మొత్తం క్లియర్ చేసేసింది. మళ్లీ ముఖానికి రంగేసుకునే ఛాన్స్ లేదని చెప్పేసింది. నటించడం కంటే నిర్మించడంలోనే కిక్ ఉందంటోంది ఈ బూరెబుగ్గల బ్యూటీ. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తీస్తున్న విజయ్ దేవరకొండ సినిమాకి ఆమె ఒక నిర్మాత. ఆకాష్ పూరి హీరోగా రూపొందుతోన్న 'రొమాంటిక్' సినిమాకి కూడా ఆమె ప్రొడ్యూసర్.