మరోసారి ఫైర్ అయిన చిన్మయి

Chinmayi fumes over sexist comment
Monday, November 25, 2019 - 18:30

సింగర్ గా కంటే, మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడే సెలబ్రిటీగానే ఎక్కువగా పాపులర్ అవుతోంది చిన్మయి. కాస్టింగ్ కౌచ్, న్యూడిటీ పై ఇప్పటికే ఓపెన్ గా మాట్లాడి సంచలనంగా మారిన ఈ గాయని, ఇప్పుడు మరో అంశంపై తనదైన శైలిలో, తీవ్రంగా స్పందించింది.

ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి ఓ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న మహిళ తలుపు తీసింది. ఆమె కాస్త అసభ్యకరంగా ఉందనేది డెలివరీ బాయ్ ఆవేదన. కొంచెం పద్ధతిగా ఉండమని, వీలైతే శాలువా లాంటిది కప్పుకోవచ్చు కదా అని అతడు ఆమెకు సలహా ఇచ్చాడట. దానిపై సదరు మహిళ ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించింది. డెలివరీ ఇవ్వడానికి వచ్చారా, సొంత ఇంట్లో ఎలా ఉండాలో నీతులు చెప్పడానికి వచ్చారా అని ఆవేదన వ్యక్తంచేసింది.

దీనిపై నెటిజన్లు చాలా రకాలుగా స్పందించారు. అయితే చిన్మయి మాత్రం సదరు మహిళకు మద్దతుగా మాట్లాడింది. అంతేకాదు, మొత్తం వ్యవహారాన్ని తనవైపు తిప్పుకుంది కూడా. అమ్మాయిల వక్షోజాల వైపు చూసే మగాళ్లు, తల్లిపాలు పెరిగినట్టు కనిపించరు అంటూ తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. దీంతో ఆమె నెట్ లో మరోసారి ట్రోలింగ్ కు గురైంది.

అయితే ఇలాంటి ట్రోలింగ్స్ చిన్మయికి కొత్తకాదు. ఎంత తిడితే అంత రెచ్చిపోతుంది ఈమె. ఈసారి కూడా అదే చేసింది. ఒంటిపై దుప్పట్టా లేదా చున్నీ కప్పుకోకపోతే, అది నగ్నత్వం లేదా రేప్ చేసుకోవడానికి ఫ్రీ పర్మిషన్ అన్నట్టు చాలామంది భావిస్తున్నారని ఆరోపించింది. ఇంట్లో మహిళ ఎలా ఉండాలో చెప్పే అర్హత డెలివరీ పర్సన్ కు ఉండదని, నిజానికి డెలివరీ బాయ్ కు అది వర్క్ ప్లేస్ తో సమానమని అంటోంది.

ఓవైపు ఈ రచ్చ నడుస్తుండగానే, ఎవరో చిన్మయి ఫొటోను మార్ఫింగా చేశారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానంద దగ్గర చిన్మయి ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు ఫేక్ ఫొటో పెట్టారు. దీంతో చిన్మయి మరింత కోపంతో ఊగిపోయింది. డెలివరీ బాయ్ ను వదిలేసి, ఆ నకిలీ ఫొటోపై ట్వీట్స్ అందుకుంది