మాది ఫెమినిస్టుల ఫ్యామిలీ

Chinmayi talks about her family
Wednesday, May 13, 2020 - 13:15

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. లాక్ డౌన్ టైమ్ లో ఓ ఛానెల్ తో లైవ్ ఛాట్ లో మాట్లాడిన చిన్మయి.. రాహుల్ రవీంద్రన్ తో తన పెళ్లి ఎలా జరిగిందనే విషయంపై ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. మరీ ముఖ్యంగా అసలు పెళ్లే చేసుకోనని అనుకున్న తను, రాహుల్ ను పెళ్లాడానని చెప్పుకొచ్చారు.

"మా అమ్మ సింగిల్ పేరెంట్. ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది. నాకు పెళ్లి చేయడానికి నిర్ణయించింది. 2-3 సంబంధాలు వచ్చాయి. వచ్చిన వాళ్లంతా సంపాదనలో మీ అమ్మకు ఎంతిస్తావ్, మాకు ఎంతిస్తావ్ అని అడగడం నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఏ ఒక్కరు ఈ విషయంలో కొత్తగా మాట్లాడలేదు. దీంతో విసుగెత్తి ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను."

సరిగ్గా అదే టైమ్ లో రాహుల్ తన జీవితంలోకి ఎంటరయ్యాడని, అతడ్ని కూడా చాన్నాళ్లు తను ఫ్రెండ్స్ లిస్ట్ లోనే పెట్టానని.. ఎప్పుడైతే అతడి తల్లిదండ్రులు పరిచయమయ్యారు ఇక అప్పుడే రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది

"రాహుల్ వాళ్ల అమ్మానాన్నను కలిసిన తర్వాత నాకు చాలా దగ్గరగా అనిపించారు. నిజానికి వాళ్లు పెళ్లి కూడా ఆర్భాటంగా వద్దన్నారు. ఎక్కడికైనా వెళ్లి ఏదో గుడిలో తాళి కట్టించుకోమన్నారు. మహిళలకు వాళ్లిచ్చే రెస్పెక్ట్ కూడా చాలా బాగుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మాది ఫెమినిస్టుల ఫ్యామిలీ అయిపోయింది."

మీటూ ఉద్యమంపై గట్టిగా పోరాటం చేస్తున్న చిన్మయి, ఏదో ఒక రోజు తన ఉద్యమం సక్సెస్ అవుతుందని అంటోంది. ఇండియాకు స్వతంత్రం కూడా ఒక్కసారి వచ్చేయలేదని, దాదాపు వందేళ్లు కష్టపడ్డారని, తన పోరాటం కూడా అలాంటిదే అంటోంది.