పసుపులేటికి చిరంజీవి ఘన నివాళి

Chiranjeevi pays condolences to Pasupuleti's death
Tuesday, February 11, 2020 - 19:00

తొలితరం ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మంగళవారం గుండెపోటుతో కన్ను మూశారు. ఆయనకీ 70 ఏళ్ళు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఆయన్ని తొలిసారి ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ...పసుపులేటి. చిరంజీవితో సావిత్రి కాలం నుంచి నేటి వరకు విశ్రాంతి లేకుండా సినీ జర్నలిజాన్ని కొనసాగించారు. జర్నలిస్ట్ గా, సినిమాల పీఆర్వో గా దశాబ్దాల పాటు చిత్రసీమకి సేవలందించారు. చివరివరకు నిరాండబరమైన జీవనశైలినే కొనసాగించారు. 

రాయడం తప్ప మరోటి తెలీని జర్నలిస్ట్ ఆయన. ఆయన భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి ఘన నివాళులు అర్పించారు. "ఎప్పటికప్పుడు ఆయన యోగక్షేమాలు కనుకున్నేవాణ్ణి. నాకు చాలా ఆప్తుడు రామారావు గారు. అయన కుటుంబానికి అండగా ఉంటాను," అన్నారు చిరంజీవి. "ఆయనతో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వామపక్ష భావాలు కలిగిన జర్నలిస్ట్. ఆయన ఆత్మకి శాంతి కలగాలి," అన్నారు పవన్ కళ్యాణ్. 

 ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ సంతాపం

"తొలితరం సీనియర్ సినీ పాత్రికేయుడు శ్రీ పసుపులేటి రామారావు గారి  మృతి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ సభ్యులకు తీరనిలోటు.  45 సంవత్సరాల నుండి  సినిమా పాత్రికేయుడుగా అనుభువం ఉన్న రామారావు గారు మా అసోసియేషన్ గౌరవ సభ్యులుగా కొనసాగుతూ మాకు ఎప్పటి కప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మమ్ములను ముందుండి  నడిపిస్తున్న శ్రీ పసుపులేటి రామారావు గారు ఇలా అకాల మరణం చెందటం మాకు తీవ్ర  ద్రిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,  వారి కుటుంబానికి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము," అన్నారు ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ అద్యక్షులు లక్ష్మి నారాయణ.