హీరోలు, హీరోయిన్లు కారవాన్ లో దూరొద్దు

Chiranjeevi slams caravan culture
Tuesday, March 3, 2020 - 10:30

స్టార్ హీరోలు సినిమాలు చేసేటప్పుడు బడ్జెట్ నిర్మాత చేతిలో ఉండదు. అలా అని అంతా సినిమా కోసమే ఖర్చు చేస్తున్నాడనుకుంటే పొరపాటే. హీరోహీరోయన్ల మెయింటెనెన్స్ కే తడిసి మోపెడవుతుంది. ఇలాంటి కథల్ని (వ్యథల్ని) బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో పాతుకుపోయిన కారవాన్ సంస్కృతి మారాలంటున్నారు చిరు.

ఒకప్పుడు కారవాన్ ను హీరో సౌకర్యం కోసం ఏర్పాటుచేసేవారు. బట్టలు మార్చుకోవడం, టాయిలెట్ లాంటి పనుల కోసం వాడేవారు. ఇప్పుడు కూడా వాటికే వాడుతున్నారు కానీ అది కాస్తా స్టేటస్ సింబల్ గా మారిపోయిందంటున్నారు చిరు. హీరో కారవాన్ లోకి దూరిపోతే బయటకు రావడం లేదని, అది సినిమా మేకింగ్ పై ప్రభావం చూపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.

లొకేషన్ లోనే హీరోహీరోయిన్లు కుర్చీ వేసుకొని కూర్చుంటే పనులు తొందరగా అవుతాయంటున్నారు చిరు. ఇలా చేయడం వల్ల కనీసం 10 రోజులు ఆదా అవుతుందని, నిర్మాతకు తేలిగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. లొకేషన్ లో కూడా హీరోహీరోయిన్లకు గొడుగులు పట్టేవారు, అవసరమైతే టెంట్ వేసేవారు ఉంటారని చెబుతున్నారు.

ఇకనైనా హీరోహీరోయిన్లు కారవాన్ ను ఓ ప్రెస్టీజ్ సింబల్ గా ఫీల్ అవ్వడం మానేయాలని కోరుతున్నారు చిరంజీవి. మరీముఖ్యంగా ఓ అసిస్టెంట్ డైరక్టర్ ను అలానే కారవాన్ వద్ద ఉంచేయడంతో అతడి కెరీర్ నాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. చిరంజీవి ఆవేదనను  ఎంతమంది హీరోలు అర్థం చేసుకొని పాటిస్తారో చూడాలి.