కరోనా వారియర్స్ కు 'చిరు' విజ్ఞప్తి

Chiranjeevi's request for plasma donation
Saturday, July 25, 2020 - 17:15

కరోనాను జయించిన వ్యక్తుల్లో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఇలాంటి వ్యక్తులు ప్లాస్మా ఇస్తే, ఆ ప్లాస్మాతో మరో ముగ్గురు కరోనా రోగుల్ని బతికించుకోవచ్చు. అయితే ఈ విషయంలో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో 99శాతం మంది ప్లాస్మా ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. దీంతో ప్లాస్మా దానం చేయాల్సిందిగా ప్రభుత్వం, పోలీస్ అధికారులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.. ఇప్పుడీ క్యాంపెయిన్ కు తనవంతు సహకారం అందిస్తున్నారు చిరంజీవి.

ప్లాస్మా డొనేషన్ పై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సైబరాబాద్ పోలీసులకు బాసటగా నిలిచారు చిరంజీవి. దయచేసి ప్లాస్మా దానం చేయండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్నాళ్లూ కరోనా వారియర్స్ అనిపించిన వాళ్లంతా ఇప్పుడు కరోనా పేషెంట్ల పట్ల సేవియర్స్ గా నిలవాలని కోరుతున్నారు. చిరు రంగంలోకి దిగడంతో ప్లాస్మా ఇవ్వడానికి చాలామంది ముందుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలినాళ్ల నుంచి తనవంతు ప్రయత్నంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు చిరంజీవి. ముఖానికి మాస్కులు ధరించండనే సందేశాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే... షూటింగ్స్ లేక ఉపాధి కోల్పోయిన సినీకార్మికులకు సీసీసీ ద్వారా తనవంతు సహాయం అందిస్తున్నారు. ఇప్పుడు ప్లాస్మా దానం చేయమంటూ కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.