ఎక్కువ ఊహించుకుంటున్న స‌ప్త‌గిరి!

Comedian Saptagiri showing too much of heroism!
Monday, November 27, 2017 - 23:00

స‌ప్త‌గిరి మంచి క‌మెడియ‌న్‌. త‌క్కువ టైమ్‌లో ఎక్కువ పాపుల‌ర్ అయ్యాడు. క‌మెడియ‌న్‌గా కొంత పాపుల‌ర్ కాగానే హీరోగా మారాల‌నే దుర‌ద మొద‌ల‌వుతుంది. బ్ర‌హ్మానందం, ఆలీ, వెన్నెల కిషోర్, సునీల్‌....ఇలా ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ అంతా అలా త‌మ‌ దుర‌ద తీర్చుకున్న‌వారే. చేతులు కాలాక మ‌ళ్లీ హాస్య‌మే శ్రీరామ‌ర‌క్ష అని తెలుసుకున్న‌వారే. సునీల్ ఒక్క‌డే ఇప్ప‌టికీ బ్యాటింగ్ చేస్తున్నాడు...ఎదో ఓ టైమ్‌లో ఫామ్‌లోకి రాలేక‌పోతానా అన్న ఉద్దేశంతో. 

రీసెంట్‌గా స‌ప్త‌గిరి హీరో అయ్యాడు. ఇపుడు రెండో సినిమాని రెడీ చేశాడు. అయితే మొద‌టి సినిమాలో చేసిన పొర‌పాటే ఇపుడూ చేస్తున్నాడనిపిస్తోంది

"స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్" అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది ఆడ‌లేదు. కామెడీ క‌న్నా హీరోయిజానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డంతో ఆ సినిమాతో ఎదురుదెబ్బ చూశాడు. ఇపుడు హిందీలో సూప‌ర్‌హిట్ట‌యిన "జాలీ ఎల్ఎల్‌బి" సినిమాని "స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బి" పేరుతో రీమేక్ చేశాడు. హిందీలో అర్షాద్ వార్సి అనే కమెడియ‌న్ క‌థానుగుణంగా క‌థానాయ‌కుడిగా న‌టించాడు. హీరోయిజం చూప‌లేదు.

కానీ తాజాగా విడుద‌లైన "స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బి" ట్ర‌యిల‌ర్ చూస్తుంటే స‌ప్త‌గిరి సునీల్‌లా తాను క‌మెడియ‌న్‌ని అన్న బేసిక్ విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్లుంది. మిగ‌తా అగ్ర హీరోల్లా డ్యాన్స్‌లు, ఇత‌ర హీరోయిక్ ఎలిమెంట్స్ లో త‌మ ప్ర‌తిభ‌ని చూపే ప్ర‌య‌త్నం క‌నిపిస్తోంది. అదే డామినేట్ చేస్తోంది. క‌మెడియ‌న్లు హీరోలుగా మారినా... వారి ద‌గ్గ‌రి నుంచి జ‌నం హాస్య‌మే ఆశిస్తారు త‌ప్ప వీరి హీరోయిజం చూసేందుకు కాద‌న్న విష‌యం గ్ర‌హించాలి వీరంతా. సునీల్ అదే త‌ప్పుతో ఇపుడు కుదేల‌య్యాడు. స‌ప్త‌గిరి అదే ట్రాక్‌లో వెళ్తున్నాడు. 

మ‌రి ఈ చిత్తూరు కుర్రోడికి ఈ సినిమా అయినా హీరోగా విజ‌యాన్ని ఇస్తుందా?