బన్నీ, కొరటాల మూవీ కథ ఇదేనా!

The concept of AA21 movie
Friday, July 31, 2020 - 17:30

అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ కాంబినేషన్ పై ఎనౌన్స్ మెంట్ వస్తుందని నిన్నట్నుంచే అందరికీ తెలుసు. కాబట్టి చాలామందికి పెద్దగా సర్ ప్రైజ్ అనిపించలేదు. అయితే  ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందర్నీ ఆకర్షించిన ఎలిమెంట్.. కాన్సెప్ట్ పోస్టర్.

అవును.. బన్నీతో సినిమా కోసం కొరటాల శివ డిజైన్ చేయించిన కాన్సెప్ట్ పోస్టర్ అందర్నీ ఆలోచింపజేసేలా ఉంది. క్లుప్తంగా చెప్పుకుంటే.. ఓ నదికి ఇటువైపు హీరో తన స్నేహితుడితో నిల్చొంటాడు. వీళ్ల వైపు అంతా చీకటి, ఓ తెప్ప, గుడ్డిదీపం, అన్నీ రాళ్లురప్పలు.

నదికి మరోవైపు మాత్రం అభివృద్ధి చెందిన నగరం కనిపిస్తుంది. రోడ్లు, విద్యుత్ దీపాలు, భారీ భవంతలు, సెల్ టవర్లు ఇలా అన్నీ ఉన్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులు ఆ నగరం వైపు చూస్తూ నిల్చొనేలా ఈ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సందేశాత్మక సినిమాల్ని కమర్షియల్ గా తీయడంలో కొరటాల దిట్ట అనే విషయం అందరికీ తెలిసిందే. బన్నీతో చేయబోయే సినిమాకు కూడా అలాంటి ఓ బలమైన సామాజిక అంశాన్నే కొరటాల సెలక్ట్ చేసుకున్నాడనే విషయం ఈ పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. ఒకప్పుడు రంగస్థలం సినిమాను ప్రకటించినప్పుడు ఆ కాన్సెప్ట్ పోస్టర్ పై ఎంత చర్చ నడిచిందో, ప్రస్తుతం బన్నీ-కొరటాల సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ పై కూడా అంతే డిస్కషన్ నడుస్తోంది.