చిన్న సినిమాపై కరోనా దెబ్బ

Corona effect on small films
Tuesday, March 31, 2020 - 17:30

కరోనాతో మొత్తం లాక్ డౌన్ అయింది. దీనికి టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. సినిమాల షూటింగ్స్ తో పాటు రిలీజెస్ కూడా ఆగిపోయాయి. దాదాపు అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. మరి చిన్న సినిమాల పరిస్థితేంటి? చిన్న సినిమాల్ని వాయిదా వేసి వెయిట్ చేసేంత శక్తి ఆ సినిమా నిర్మాతలకు ఉండదు. తక్కువలో తక్కువ వంద థియేటర్లు (తెలుగు రాష్ట్రాల్లో) దొరికినా రిలీజ్ చేసి, భారం తగ్గించుకోవాలనే చూస్తారు. కానీ కరోనా కారణంగా ఆ వెసులుబాటు కూడా లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక, తప్పనిసరి పరిస్థితుల మధ్య డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణగా నిలిచింది శక్తి అనే డబ్బింగ్ సినిమా.

లెక్కప్రకారం.. మార్చి 25న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికే లాక్ డౌన్ అమలైంది. ఓ నెల రోజులాగి ఏప్రిల్ లో రిలీజ్ చేద్దాంటే పోస్ట్ పోన్ అయిన పెద్ద సినిమాలన్నీ కాచుక్కూర్చున్నాయి. ఇలాంటి టైమ్ లో శక్తి రిలీజ్ కష్టమే. మే నుంచి పోటీ మరింత తీవ్రంగా ఉంది.

ఈ పరిస్థితుల్లో చేసేదేం లేక థియేటర్ లో రిలీజ్ చేయడాని కంటే ముందే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు ఇచ్చేశారు శక్తి సినిమాను. ఇవాళ్టి నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ప్రత్యక్షమైంది.

మొన్నటికిమొన్న ఓ పిట్టకథ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో.. థియేటర్లలోకొచ్చి 2 వారాలైనా పూర్తికాకుండానే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి సినిమాతో పాటు మరిన్ని చిన్న సినిమాలు ఇలా కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయాయి.