మహానుభావుడు మళ్లీ వైరల్ అయ్యాడు

Corono effect: Mahanubhavudu movie becomes viral
Thursday, March 5, 2020 - 14:45

శర్వానంద్ హీరోగా నటించిన సినిమా మహానుభావుడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అతడి కెరీర్ లో ఓ హిట్ చిత్రంగా నిలిచింది. మూడేళ్ల కిందటొచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి  వైరల్ అవుతోంది. శర్వానంద్ నటించిన క్లిప్పింగ్స్, అతడి ఫొటోలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. 2017లో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం కరోనా.

అవును.. హైదరాబాద్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో.. మహానుభావుడు సినిమాలో శర్వానంద్ క్లిప్పింగ్స్ ను నెటిజన్లు తెరపైకి తీసుకొచ్చారు. ఆ సినిమాలో శర్వానంద్ అతిశుభ్రత అనే ఫోబియా కలిగిన వ్యక్తిగా నటించాడు. ఇప్పుడీ అతి శుభ్రత చాలా అవసరం అంటున్నారు నెటిజన్లు. కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మహానుభావుడు సినిమాలో శర్వానంద్ లా ఉండాలని.. హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్ లు తప్పనిసరిగా వాడాలంటూ ఆ సినిమా క్లిప్పింగ్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో శర్వానంద్ బాస్ కు తుమ్ము వస్తుంది. వెంటనే శర్వానంద్ అక్కడ్నుంచి మాయం అవుతాడు. అల్లంత దూరం వెళ్లిపోయి, ఇప్పుడు తుమ్మండి సర్ అంటాడు. సినిమాలో అప్పుడు ఆ సీన్ పేలినప్పటికీ.. ఇప్పటి పరిస్థితుల్లో ఆ సీన్ ను ఫాలో అవ్వడమే కరెక్ట్ అంటున్నారు చాలామంది.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. మహానుభావుడు సినిమా నుంచి చాలా సీన్స్, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా వల్ల ఈ సినిమా ఇప్పుడు హైలెట్ అవుతోంది.