తొందరపడకు సుందరవదన!

Dil Raju's word of caution
Monday, July 13, 2020 - 08:30

దిల్ రాజు.. తన టీంకి చెప్తున్న మాట ఇదే. కొత్త సినిమాలు, కొత్త కథలు అంటూ వస్తున్న డైరెక్టర్లతో ఇదే మాట అంటున్నాడు. వచ్చే వేసవి వరకు కరోనా, దాని ప్రభావం ఉంటుందని, అప్పుడు తొందర పడొద్దని దర్శకులకు చెబుతున్నాడు. మీడియాలో రాసే కాంబినేషన్లు చూసి ఎగిరి పడొద్దంటున్నాడు.

ఇండస్ట్రీలో దిల్ రాజును అంతా మూవీ మేకింగ్ మెషీన్ గా చూస్తారు. ఒకే ఏడాదిలో 6 సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు కూడా ఉంది. ఏడాదికి కనీసం 4 సినిమాలకు తగ్గకుండా నిర్మిస్తుంటాడు. ఇతడి చుట్టూ కనీసం ఆరుగురు దర్శకులుంటారు. రకరకాల కథలు డిస్కషన్ స్టేజ్ లో ఉంటుంటాయి.

అయితే కరోనా దెబ్బకు దిల్ రాజు కాంపౌండ్ లో ఉత్సాహమంతా చల్లారిపోయింది. కాస్తోకూస్తో ఉత్సాహం చూపిస్తున్న వాళ్లను దిల్ రాజు చల్లారుస్తున్నాడు. ఆవేశపడితే మొదటికే మోసం వస్తుందని సర్దిచెబుతున్నాడు. కొంతమందినైతే ఓటీటీ వైపు మళ్లించే ఆలోచన కూడా చేస్తున్నాడు ఈ కింగ్ పిన్.

ప్రస్తుతానికైతే దిల్ రాజు ముందున్న టార్గెట్ ఒకటే. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తిచేసి దాన్ని రిలీజ్ చేయాలి. ఆల్రెడీ రెడీగా ఉన్న V సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలి. జెర్సీ హిందీ రీమేక్ ను కొలిక్కితేవాలి. ఈ 3 కమిట్ మెంట్లు పూర్తయిన తర్వాతే దిల్ రాజు నెక్ట్స్ స్టెప్ ఉంటుంది.