మంచి చెఫ్ గా మారిన దర్శకురాలు

Director Nandini Reddy becomes a chef!
Saturday, May 16, 2020 - 13:15

డైరక్టర్ నందినీరెడ్డి ఇప్పుడు మంచి చెఫ్ గా మారిపోయింది. రకరకాల వంటలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నానని చెబుతోంది ఈ దర్శకురాలు. ఈ లాక్ డౌన్ టైమ్ లో అదే తనకు పెద్ద పనిగా మారిందంటోంది.

- లాక్ డౌన్ లో ఏం చేస్తున్నారు?
పని మనిషి రావడం లేదు. ఇంటి పనులన్నీ నేనే చేస్తున్నా. రకరకాల వంటకాలు ట్రై చేస్తున్నాను. పెద్ద చెఫ్ గా మారిపోయేట్టున్నాను. ఇంకా టైమ్ ఉంటే పుస్తకాలు, నెట్. ఇదే లోకం. అమ్మ మాత్రం టీవీలో వార్తలు చూసి నాకు హెడ్ లైన్స్ చెబుతుంటుంది.

- నెక్ట్స్ ప్రాజెక్ట్?
నా తర్వాత సినిమా వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఉంటుంది. దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదొక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఫన్ తో పాటు హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.

- లాక్ డౌన్ లో బాగా మిస్సవుతున్నవి ఏంటి?
రోజూ మా ఇంటి పక్కనే ఉన్న పార్క్ లో వాకింగ్ చేస్తాను. ఆ పార్క్ మిస్సవుతున్నాను. అలాగే రోజూ స్విమ్మింగ్ చేస్తాను. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా మిస్సవుతున్నాను.

- ఈ లాక్ డౌన్ లో ఏమేం చూస్తున్నారు?
ఇది అది అనే తేడాలేకుండా అన్నీ చూస్తున్నాను. అయితే మలయాళం స్టఫ్ ఎక్కువగా చూస్తున్నాను. దీంతో పాటు సిరీస్ లు కవర్ చేస్తున్నాను. ఈమధ్య (caliphate) అనే సిరీస్ చూశాను. బ్రహ్మాండంగా ఉంది.

- థియేటర్ కంటే ముందే సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తున్నారుగా?
ఏ దర్శకుడైనా బిగ్ స్క్రీన్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తాడు. ఓ 500 మంది ఒకేసారి నవ్వితే, లేదంటే ఏడిస్తే చూడాలనుకుంటాడు. పైగా సౌండింగ్, ఎడిటింగ్, ఫ్రేమింగ్ అంతా 70mm స్క్రీన్ ను దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. అలాంటి సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలంటే బాధగానే ఉంటుంది. కానీ నిర్మాతల యాంగిల్ లో కూడా ఆలోచించాలి. ముందే ఓటీటీకి ఇచ్చేయడం వల్ల మరీ లాభాలు రాకపోయినా, బొటాబొటిగా అయినా ప్రొడ్యూసర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నిర్మాతకే మద్దతిస్తాను.

- థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అవుతాయా??
నాకు తెలిసి సెప్టెంబర్ కంటే ముందు థియేటర్లు ఓపెన్ కావు. ఇక జనాల విషయానికొస్తే.. వచ్చే ఏడాది జనవరి వరకు జనాలు రాకపోవచ్చు. కనీసం ఈ ఏడాది చివరి వరకు జనాలు రారు. ఆర్థిక మాంద్యం మాత్రం వచ్చేసింది. రెండేళ్లు ఇబ్బందే. అంతా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోండి.