న‌క్క తోక తొక్కిన సుజీత్‌

Director Sujeeth hits jackpot totally!
Wednesday, August 16, 2017 - 14:45

సుజీత్‌కి మామూలుగా సుడి తిర‌గ‌లేదు. రెండో సినిమాకే బ‌డా హీరో, వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌, హ‌లీవుడ్ టెక్నీషియ‌న్లు, బాలీవుడ్ హీరోయన్‌....ఇలా అన్ని మీల్స్ ప్లాట‌ర్‌లా ప‌రుచుకున్నాయి అత‌ని ముంగిట‌. ఇలాంటి చాన్స్ పెద్ద ద‌ర్శ‌కుల‌కే రాదు. కానీ మాస్ భాష‌లో చెప్పాలంటే..సుజీత్‌కి ఎక్క‌డో సుడి ఉంది. అందుకే ఇలా అన్నీ రెండో సినిమాకి సెట్ అయిపోయాయి.

సుజీత్ మొద‌టి సినిమా.. ర‌న్ రాజా ర‌న్‌. శ‌ర్వానంద్ వంటి యువ హీరోతో ఒక చిన్న సినిమా తీసి హిట్ కొట్టిన ఏ ద‌ర్శ‌కుడికైనా నాని, ర‌వితేజ లాంటి మీడియం రేంజ్ హీరోల నుంచి అవ‌కాశాలు వ‌స్తాయి. వెంట‌నే పెద్ద హీరోని డైర‌క్ట్ చేసే ఛాన్స్ రాదు. కానీ సుజీత్ న‌క్క తోక తొక్కాడు. అందుకే ప్ర‌భాస్ సుజీత్‌కి పిలిచి మ‌రీ చాన్స్ ఇచ్చాడు. 

బాహుబ‌లి సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్‌తో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు బ‌డా ద‌ర్శ‌కులంద‌రూ క్యూ క‌ట్టారు. అలాంటి టైమ్‌లో సుజీత్‌కి చాన్స్ ఇవ్వ‌డ‌మే గ్రేట్‌. దానికి తోడు, 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌ని కూడా అత‌ని చేతిలో పెట్టాడు ప్ర‌భాస్‌.

తెలుగు, ఇంగ్లీషు మాత్ర‌మే మాట్లాడే సుజీత్ ఇపుడు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాషా ప్రేక్ష‌కుల‌కి కూడా ప‌రిచ‌యం కానున్నాడు. ఆ భాష‌ల్లో సినిమా డ‌బ్ కానుంది. ఈ విష‌యంలో సుజీత్‌కి అన్ని విధాలా హెల్ప్ చేసే లాంగ్వేజ్ ఎక్స్‌ప‌ర్ట్‌ల‌ను, ఆయా భాష‌ల‌కి చెందిన సాంకేతిక నిపుణుల‌ను కూడా ప్ర‌భాస్ అండ్ యూవీ టీమ్ తీసుకొచ్చింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్దాక‌పూర్ కూడా హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది.

ఏ ర‌కంగా చూసినా..ఒక అప్‌క‌మింగ్ డైర‌క్ట‌ర్‌కి "సాహో" వైల్డ్ డ్రీమ్‌లాంటి ప్రాజెక్ట్‌.