సితారలో సెకండ్ సిండ్రోమ్ లేదు

Directors overcoming second syndrome in Sitara banner
Saturday, February 22, 2020 - 15:45

ఒక దర్శకుడు ఫస్ట్ మూవీ హిట్ కొడితే రెండో సినిమాని గోవిందా అనిపిస్తాడు అనేది ఇండస్ట్రీలో టాక్. దీన్నే సెకండ్ మూవీ సిండ్రోమ్ (ద్వితీయ విఘ్నం) అంటారు. తేజ, వినాయక్, సురేందర్ రెడ్డి, సుకుమార్... ఇలా లిస్ట్ చాలా పెద్దదే. రాజమౌళి, శివ కొరటాల... ఇలా అతికొద్దిమంది దర్శకులే సెకండ్ సిండ్రోమ్ బారిన పడకుండా నిలబడ్డారు. 

ఐతే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలో తమ రెండో సినిమా తీసిన దర్శకులు ఈ సిండ్రోమ్ నుంచి బయటపడుతున్నారట. 'కార్తికేయ' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు చందూ మొండేటి. రెండో సినిమాగా సితార బ్యానర్ లో 'ప్రేమమ్' తీసి విజయం సాధించాడు. మూడో సినిమా 'సవ్యసాచి'తో అపజయం అందుకున్నాడు. ఐతే, సెకండ్ మూవీ సిండ్రోమ్ నుంచి మాత్రం తప్పించుకున్నాడు. 

అలాగే, సుమంత్ హీరోగా నటించిన 'మళ్ళీ రావా' సినిమాతో మార్కులు కొట్టేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన కెరీర్లో రెండో సినిమాగా సితార బ్యానర్ పై నాని హీరోగా 'జెర్సీ' సినిమా డైరెక్ట్ చేశాడు. అది దర్శకుడిగా గౌతమ్ కెరీర్ ని మార్చేసింది. 

ఇప్పుడు మూడోసారి మరో దర్శకుడి విషయంలోనూ జరిగింది. 'ఛలో' సినిమాతో పరిచయం అయిన వెంకీ కుడుముల రెండో సినిమాగా భీష్మ డైరెక్ట్ చేశాడు. ఇది కూడా సితార బ్యానర్ మూవీనే. ఇది కూడా విజయం దిశగా సాగుతోంది. ఆలా సెకండ్ మూవీ సిండ్రోమ్ తొలగించుకోవడానికి సితార బ్యానర్ లక్కిగా మారింది దర్శకులకి.