వణుకుతున్న టాలీవుడ్...అన్నీ ఫోన్లోనే

Fear grips Tollywood stars, coronavirus crisis
Sunday, July 12, 2020 - 13:15

షూటింగ్స్ కు అనుమతి ఇచ్చినా కరోనా వ్యాప్తి చూసి టాలీవుడ్ వణికిపోతోంది. అందుకే చెప్పుకోదగ్గ సినిమాలేవీ సెట్స్ పైకి రాలేదు. సినిమాల సంగతి పక్కనపెట్టి ఇండస్ట్రీ ప్రముఖులంతా ఇప్పుడు తమ ఆరోగ్యం, కుటుంబం, శానిటైజనేషన్ పై పూర్తిగా దృష్టిపెట్టారు.

దాదాపుగా హీరోలంతా ఆరోగ్యకరపైన పౌష్టికాహారాన్నే తీసుకుంటారు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటారు. కరోనా టైమ్ లో ఇంట్లోకి వచ్చే ఆహార పదార్థాలన్నిటినీ ప్రత్యేకంగా డిస్ ఇన్ఫెక్ట్ చేయిస్తున్నారు. ఇంటిల్లిపాదీ విటమిన్ సప్లిమెంట్ లు తీసుకుంటున్నారు. పనివాళ్లను కూడా ఇళ్లకు వెళ్లొద్దని చెప్పేశారు. ఔట్ హౌస్ లోనే పనివాళ్ల మకాం. వారికి కూడా ఓ దఫా కరోనా టెస్ట్ లు చేసి నెగెటివ్ వచ్చిన తర్వాతే ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. అలా కుదిరిన వారినే పనిలో ఉంచుకుని మిగతా వారికి సెలవలు ఇచ్చేశారు.

కుర్రహీరోలు ఒకరిద్దరు దీనికి మినహాయింపు. మిగతావారంతా అతి జాగ్రత్తలతో సతమతమవుతున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బిగ్ బీలాంటి వారిని కూడా కరోనా విడిచిపెట్టలేదు. దీంతో టాలీవుడ్ ప్రముఖుల్లో కరోనా భయం ఎక్కువైంది.

రాజకీయ నాయకులు జనాల్లో తిరుగుతారు, సమస్యలపై వచ్చేవారు నాయకుల్ని కలుస్తారు. అలా వారికి వ్యాధి సోకుతుంది అని అంచనా వేయొచ్చు. మరి జాగ్రత్తగా ఉండే సినీ జనాలు కూడా కరోనా బారిన పడుతుండే సరికి.. మిగిలినవారిలో భయం తారాస్థాయికి చేరుకుంది.

ఈమధ్య కాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీ సమావేశాలు కూడా అందుకే జరగడం లేదు. వాస్తవానికి కరోనా తగ్గే వరకూ తరచూ సమావేశమై భవిష్యత్ కార్యచరణపై నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నారు పెద్దలంతా. ఇప్పుడు ఎవరినా నమ్మి ఇంటికి పిలిచే పరిస్థితి లేదు, బైటకెళ్లే ఆలోచన అంతకంటే లేదు. అందుకే అన్ని వ్యవహారాలు ఫోన్లోనే జరిగిపోతున్నాయి.

ఇలా టాలీవుడ్ ప్రముఖులంతా సినిమాల కంటే తమ ఆరోగ్యం, కుటుంబంపై ఎక్కువగా దృష్టిపెట్టారు.